Home రాజకీయాలు పబ్లిసిటీ పిచ్చితో లైవ్‌లో తిట్టుకున్నారు..

పబ్లిసిటీ పిచ్చితో లైవ్‌లో తిట్టుకున్నారు..

SHARE

ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందంటే అందుకు కారణం వైఎస్‌ జగనేనని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. బీజేపీ- చంద్రబాబు కలిసి హోదాను చంపేయబోతే జగనే బతికించారన్నారు. ఢిల్లీలో ఎంపీల దీక్ష శిబిరం వద్ద మాట్లాడిన ఆమె.. ఏపీకి అన్యాయం జరుగుతుంటే టీడీపీ ఎంపీలు ఎందుకు ఆమరణ దీక్షకు సిద్ధం కావడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ తరహాలోనే బీజేపీ, టీడీపీని ఏపీ ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని ఆమె వ్యాఖ్యానించారు. కడుపు నిండా తింటూ, ఏసీ గదుల్లో ఉంటూ హోదా కోసం పోరాటం చేస్తున్నామని టీడీపీ ఎంపీలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

మీడియాకు, పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి ప్రధాని మోడీ ఇంటి వద్దకు వెళ్లడం మెరుపు ధర్నా ఎలా అవుతుందని ప్రశ్నించారు. వెళ్లడమే ఆలస్యం పోలీసుల వ్యాన్‌ ఎక్కి వెళ్లిపోవడం మెరుపు ధర్నా అవుతుందా అని రోజా ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని రోజా విమర్శించారు.

ఢిల్లీలో టీవీల్లో కనిపించేందుకు టీడీపీ ఎంపీలు తోసుకోవడం చూసి జనం నవ్వకుంటున్నారన్నారు. ఒక చానల్‌ డిబేట్‌లో మాట్లాడేందుకు మురళీమోహన్‌, అవంతి శ్రీనివాస్‌ తిట్టుకోవడం అందరూ చూశారన్నారు రోజా. పార్లమెంట్‌ అయిపోగానే ఏపీకి పారిపోయిన టీడీపీఎంపీలు.. వైసీపీ ఎంపీల ఆందోళన చూసి తిరిగి ఢిల్లీకి వచ్చారని ఎద్దేవా చేశారు.