Home రాజకీయాలు రాధాకృష్ణకు ఐవైఆర్ కౌంటర్

రాధాకృష్ణకు ఐవైఆర్ కౌంటర్

SHARE

ప్రతిపక్షాలను, ఐవైఆర్‌ కృష్ణారావులాంటి వారి తీరును తప్పుపడుతూ రాధాకృష్ణ తన పత్రికలో ఒక ఆర్టికల్ రాశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు 33 వేల ఎకరాలు పైసా ఖర్చు లేకుండా సేకరించడం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గొప్ప విషయమేనని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. అదే ఆర్టికల్‌లో ఐవైఆర్‌పైనా విమర్శలు చేశారు. బీజేపీతో చంద్రబాబు బంధం తెగిపోవడానికి అసలు కారణం ఏంటో కూడా రాధాకృష్ణ వెల్లడించారు.

ప్రత్యేక హోదా కోసమే చంద్రబాబు బీజేపీతో బంధం తెంచుకున్నారన్నది టీడీపీ నేతలు చెబుతున్న మాట. అయితే రాధాకృష్ణ మాత్రం.. టీడీపీ- బీజేపీ మధ్య బంధం తెగిపోవడంలో గవర్నర్ నరసింహన్ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. కేంద్ర పెద్దలను ఎప్పుడు కలిసినా చంద్రబాబుకు వ్యతిరేకంగా నూరిపోశారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌, ఐవైఆర్‌ లాంటి వారితో నరసింహనే చర్చలు జరిపి రెచ్చగొట్టారని విమర్శించారు. నరసింహన్‌ సృష్టించిన అపార్ధాల వల్లే బీజేపీ- టీడీపీ బంధం తెగిపోయిందని రాధాకృష్ణ వివరించారు.

అదే సమయంలో ఐవైఆర్‌ కృష్ణారావుపై రాధాకృష్ణ నేరుగా కొన్ని ఆరోపణలు చేశారు. ఎవరి రాజధాని అంటూ అమరావతిపై ఐవైఆర్‌ రాసిన పుస్తకాన్ని కూడా ఏబీఎన్ ఎండీ తప్పుపట్టారు. హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేస్తున్న వారి వల్లే ఏపీలో ఇబ్బందులు వస్తున్నాయంటూ ఐవైఆర్‌పై రాధాకృష్ణ మండిపడ్డారు.

ఇందుకు ఐవైఆర్‌ ఘాటు కౌంటర్ ఇచ్చారు. తాను రాసిన పుస్తకంపై విమర్శలు చేయడానికి ఏమీ లేక పదాలు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. గొంతు చించుకుని అరిచినా నిజం అబద్దం కాబోదని రాధాకృష్ణకు గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ గురించి మాట్లాడుతున్నానని కొందరు విమర్శిస్తున్నారని.. మరి అలాంటి వారు అమరావతిలో నివసిస్తున్నారా అని ప్రశ్నించారు. అధికారం పోతే ఇప్పుడు అమరావతిలో ఉన్న మంత్రుల్లో ఎంతమంది అక్కడ ఉంటారని ప్రశ్నించారు.

తనకు హైదరాబాద్‌తో ఎక్కువ అనుబంధం ఉందంటున్న వారు… నేను పుట్టింది ఏపీలో, చదవింది, పని చేసింది ఏపీలో ఉన్న విషయం మరిచిపోవద్దన్నారు. తాను అమరావతిపై రాసిన పుస్తకం విషయంలో అనుమానాలుంటే చర్చకు రావాలని అందుకు తాను సిద్దమని ఐవైఆర్‌ పరోక్షంగా ఏబీఎన్ రాధాకృష్ణకు కౌంటర్‌ ఇచ్చారు.