Home రాజకీయాలు అఖిలపక్షం అసలు ఉద్దేశ్యం ఇదేనా?

అఖిలపక్షం అసలు ఉద్దేశ్యం ఇదేనా?

1234
SHARE

ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే విషయంలో తనదైన “క్రెడిట్” పోరాటం చేస్తున్నానని చెబుతున్న చంద్రబాబు శనివారం మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి… బీజేపీ, వైసీపీ, జనసేన, వామపక్ష పార్టీలు హాజరుకాలేదు. ఈ అఖిలపక్షంలోనే కానీ, అనంతరం మీడియా ముందు కానీ… ఈ సమావేశంలో జరిగిన విషయాలు, బాబు ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటన్నింటిలో స్పష్టంగా ప్రజలకు అర్ధం అవుతున్నది ఒక్కటే… “నేరం నాది కాదు” అని!

ఏపీకి ప్రత్యేకహోదా రాకపోయినా పర్లేదు కానీ… హోదా రాకపోవడానికి గల కారణం చంద్రబాబు వ్యక్తిగత స్వార్ధ రాజకీయాలు కాదని, బాబు చేతకానితనం కాదని ప్రజలు అనుకుంటే చాలు! అఖిలపక్షం పేరు చెప్పి బాబు వేస్తున్న పథకాలు ఇవేనని తాజాగా స్పష్టం అవుతుంది. ఈ సమావేశాలకు హాజరైన కొంతమంది టీడీపీ సానుభూతిపరులతో చంద్రబాబు చెప్పించారో లేక బాబు మెప్పుకోసం వారే చెప్పారో తెలియదు కానీ… ఈ హోదా సాధన విషయంలో బాబు ప్లాన్ అంతా ప్రచారం కోసమే అని స్పష్టం అవుతుంది. దానికి ఉదాహరణ… అఖిల పక్షం నిర్ణయించినట్లు చెబుతున్న వాటిలో ప్రతీ బస్సులోనూ “మోడీ, బీజేపీ ఏపీకి అన్యాయం చేశారు” అని ప్రచారం చేయాలి అని! బీజేపీ, మోడీ ఏపీకి అన్యాయం చేశారని ప్రచారం చేసుకోవడం వల్ల ఏపీకి ఒరిగేది ఏమిటి? ఈ విషయంలో గ్రామంలో బస్సులో తిరుగుతున్న సామాన్య ప్రజానికం చూసి “ఓహో.. బాబు గారిది తప్పేమీ లేదన్న మాట” అని అనుకోవడమే అఖిలపక్షం లక్ష్యమా?

ఇక ప్రభుత్వ రంగ సంస్థలకు సంబందించిన కొన్ని సంస్థలు… ముఖ్యమంత్రికి మద్దతిస్తే తెలుగుతల్లికి మద్దతిచ్చినట్లేనని అంతా భావించాలి! అని ప్రకటించడం ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం. హోదా విషయంలో ఇప్పటివరకూ బాబు ఎన్ని నాలుకమడత స్టేట్ మెంట్స్ ఇచ్చారనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం బాబు చేస్తున్న పోరాటం అని చెబుతున్న పోరాటం కూడా “కర్ర ఇరగకుండా.. పాము చావకుండా” సాగుతుందన్న సంగతీ తెలిసిందే. ఎంపీలతో రాజినామాలు చేయించే సాహసం కూడా చేయలేని పోరాటం బాబు చేస్తున్నప్పుడు… ఆయనకు మద్దతిస్తే తెలుగు తల్లికి మద్దతిచ్చినట్లేనని అఖిలపక్షం ప్రకటించడం హాస్యాస్పదం అనేవారే ఎక్కువ!!

ఏది ఏమైనా ప్రస్తుతం బాబు రెండు టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్నారు. ఒకటి… హోదా రాకపోయినా పర్లేదు కానీ ఆ నేరం తనపైనా తనచేతకానితనంపైనా పడకుండా చూసుకోవడం. రెండు… హోదా కోసం తాను తెగ పోరాడానని, తెగ కష్టపడ్డానని ప్రచారం చేసుకోవడం! ఈ ఫీట్ల మైకంలో పడిన బాబు… ఇంటికొకరు వచ్చి హోదా కోసం పోరాడాలని పిలుపునివ్వడం మరో కొసమెరుపు!!