Home రాజకీయాలు అంటే అన్నామంటారు కానీ.. ఇదేం పని బాబు!!

అంటే అన్నామంటారు కానీ.. ఇదేం పని బాబు!!

SHARE

పోరాడటం అంటే… ప్రెస్ మీట్ లు పెట్టడం, ఫోటోలకు ఫోజులివ్వడం, పత్రికల్లో భారీస్థాయి కథనాలు రాయించుకోవడం! ఇదేనా బాబుకు తెలిసిన పోరాటం.. ఇదేనా బాబుకు పోరాటం మీద ఉన్న అవగాహన? ఇప్పటివరకూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం బాబు చేసిన తనమార్కు ప్రత్యేక పోరాటాలు ఇవితప్ప మరేవీ కానరావనేది తెలిసిన విషయమే! ఆ సంగతులు అలా ఉంటే.. ప్రజల పోరాటాన్ని, ప్రతిపక్షాల దీక్షలను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు తాజాగా చేసిన పని, తనకు ప్రత్యేక హోదాపై ఉన్న సిన్సియారిటీని చెప్పకనే చెబుతుంది.

ఒకపక్క రాష్ట్రం హోదా నినాదాలతో, ధర్నాలతో, దీక్షలతో దద్దరిల్లిపోతుంది… బాబు – మోడీ కలిసి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. తమకు జరిగిన అన్యాయంపై పోరాటాలు చేస్తున్నారు. మరోపక్క వైకాపా నేతలు పట్టువిడవని విక్రమార్కుల్లా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఢిల్లీ సాక్షిగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అటు ప్రజలు, ఇటు వారి తరుపున పోరాడుతున్న ప్రతిపక్షం హోదాకోసం అలుపెరగని పోరాటాలు చేస్తుంటే, రాష్ట్రం రగిలిపోతుంటే.. చంద్రబాబు మాత్రం అధికారపక్షం సభ్యులతో అమరావతిలోని అసెంబ్లీ సభ్యుల ఆటల పోటీల్ని నిర్వహించారు.

క్రీడాపోటీల్ని నిర్వహించడం తప్పేమీ కాదు కానీ.. దానికీ ఒక సమయం సందర్భం ఉంటుందన్న విషయం ఈ సీనియర్ పొలిటీషియన్ మరిచిపోవడమే ఇక్కడ అసలు విషయం. ఇదే విషయాన్ని ఏపీ ప్రజలు తప్పు పడుతున్నారు. ఓపక్క విపక్ష సభ్యులు సభకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేస్తున్న వేళ.. రాష్ట్రంలో ఉద్యమ వాతావరణం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నడుమ.. ఢిల్లీలో ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో.. అవేమీ తమకు పట్టవన్నట్లుగా ఆటలపోటీలు నిర్వహించటాన్ని ఏమనాలి? హోదా విషయంలో బాబు మార్కు పోరాటానికి తాజా ఉదాహరణ అనాలా.. లేక హోదా విషయంలో బాబు సిన్సియారిటీ ఇదని అనుకోవాలా? చంద్రబాబే సమాధానం చెప్పాలి!!

ఈ సంఘటన తెలిసిన అనంతరం… “ఇప్పటివరకూ ఏపీ ప్రజలతో, వారి భవిష్యత్తుతో ఆడుకున్నది సరిపోలేనట్లుంది.. తాజాగా వారిలో వారు ఆడుకుంటున్నారు, బహుమతులు పంచుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు” అనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేయడం కొసమెరుపు!