Home రాజకీయాలు చేతకాని ప్రభుత్వం ఇంకా ఎందుకు పాలన సాగిస్తోంది?

చేతకాని ప్రభుత్వం ఇంకా ఎందుకు పాలన సాగిస్తోంది?

240
SHARE

చేతకాని ప్రభుత్వం, చేవలేని ముఖ్యమంత్రి.. ఎందుకు ఇంకా పాలన సాగిస్తున్నట్లు? ఈ ప్రశ్న వేసింది ప్రతిపక్షమో, సామాన్య ప్రజానికమో, రాజకీయ విశ్లేషకులో, విమర్శకులో కాదు… నిన్నమొన్నటివరకూ కలిసి కాపురం చేసిన స్వపక్ష నేతలు. అవును… టీడీపీ తో మిత్రత్వం చెడిన తర్వాత.. బీజేపీ నేతలు టీడీపీపై మాములూగా ఫైరవడం లేదు. ప్రతిపక్షం ప్రత్యేక హోదాపోరులో బిజీగా ఉంటే.. ప్రతిపక్ష నేత ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జనాల్లో తిరుగుతుంటే.. అసెంబ్లీలోనూ, బయటా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది బీజేపి!

ఈ క్రమంలో చంద్రబాబు పిలిచిన అఖిలపక్ష భేటీకి తాము హాజరుకావడం లేదని చెబుతూ రాసిన లేఖలో బాబుపై ఫైరయ్యారు విష్ణుకుమార్ రాజు! సొంత లాభం కోసమే అఖిలపక్ష భేటీ పెట్టారని మొదలుపెట్టిన విష్ణుకుమార్ రాజు.. స్వార్ధ రాజకీయ ప్రయెజనాల కోసమే “హోదా – ప్యాకేజీ” విషయంలో చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని మండిపడ్డారు. గతంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి ఒప్పుకుని.. మోడీకి, అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు చెప్పిన చంద్రబాబు.. ఇపుడు ఏపీకి కేంద్రం, ప్రధాని మోడీ అన్యాయం చేశారనడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఇక తాజాగా టీడీపీ చేస్తోన్న సైకిల్‌ ర్యాలీలపై కూడా విష్ణుకుమార్ రాజు స్పందించారు. అవన్నీ చవకబారు ప్రచారంలో భాగాలని తేల్చి పారేశారు.

మిత్రపక్షం నేతల ఫైర్ అలా ఉంటే.. స్వపక్షంలోనే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా బాబు ప్రభుత్వంపై రైతుల పేరు చెప్పి నిప్పులు చెరిగారు. తాజాగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి రైతులకు రెట్టింపు ఆదాయం అనే అంశంపై ప్రభుత్వంపై ప్రశ్నలవర్షం కురిపించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మొదలుపెట్టిన వేణుగోపాల్ రెడ్డి… రాష్ట్రంలో 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం తెస్తామని బాబు చెప్పారని, అది ఎలా సాధ్యపడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ఇప్పటివరకూ లేదని, అలాంటిదేమీ లేకుండా రైతుల ఆదాయాన్ని ఎలా పెంచుతారో చెప్పాలని డిమాండ్ చేశారు.

సరిగ్గా గమనిస్తే… ప్రతిపక్షమా, మిత్రపక్షమా, స్వపక్షమా అనే తేడా లేకుండా బాబు పాలనలో సాగుతున్న దారుణాలపైన, ప్రణాళికలు లేని పరిపాలనపైనా.. ప్రశ్నల వర్షం కురిపించడం చూస్తుంటే… బాబు పాలన ఎలా సాగుతుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అందరితోనూ చేతకాని ప్రభుత్వం అని అనిపించుకుంటున్న బాబు.. వీటన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది!!