Home రాజకీయాలు మడమతిప్పకపోవడం అంటే ఇదే!

మడమతిప్పకపోవడం అంటే ఇదే!

925
SHARE

మాట ఇవ్వడం చాలా సులువు.. అది నిలబెట్టుకోవడం చాలా కష్టం! వెనక్కి ముందుకీ అడుగులు వేస్తూ తడబటం చాలా సులువు.. ఒక్కసారి అడుగు ముందుకు వేశాక మడమ తిప్పకపోవడం మహా కష్టం!! పోరాటం అంటే మైకుల ముందు కేకలు వేయడం కాదు.. ప్రెస్ మీట్ లో ప్రగల్భాలు పలకడం కాదు!! మాటలకూ చేతలకూ ఉన్న తేడా తాజాగా టీడీపీ నేతలకు వైకాపా నేతలను చూస్తే తెలుస్తుంది. అవును… ప్రత్యేక హోదా కోసం పోరాడతున్నాం.. ఢిల్లీని కదిలిస్తున్నాం.. జాతీయస్థాయి నేతలతో మాట్లాడుతున్నాం.. ఇది కాదు కదా నిజమైన పోరాటం.. ఇది కాదు కదా మడమ తిప్పని పోరాటం.

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని టీడీపీ నేతల పోరాటం అంతా చూసినవారే! పసుపు చొక్కాలు వేసుకుని, పచ్చ ఫ్లకార్డులు చేతపట్టి హడావిడి చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తే హోదా వస్తుందా.. పోరాటంలో సీరియస్ నెస్ లేకపోతే కేంద్రానికి చీమకుట్టినట్లైనా ఉంటుందా? ఆ పోరాటంలో సీరియస్ నెస్ తమదైన శైలిలో కనబరిచారు వైకాపా ఎంపీలు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగక, అవిశ్వాస తీర్మానం చర్చకు రానిపక్షంలో రాజీనామాలకు సిద్ధం అని ప్రకటించిన వైకాపా నేతలు.. ఆపని చేసి చూపించారు. అనంతరం అమరావతికో హైదరాబాద్ కో వెళ్లి “మా పని అయిపోయింది.. జనాలకు చెప్పుకోవడానికి ఒక సమాధానం మాకు దొరికింది.. రేపటి పత్రికల్లో మా ఫోటోలు వస్తాయి” అని చల్లబడలేదు.. ముందుగా ప్రకటించినట్లుగానే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు!

ఇది మామూలు పోరాటం కాదని, ఫోటోలకు ఫోజులిచ్చే పోరాటం అసలే కాదని నిరూపించే పనికి మరోసారి పూనుకున్న వైకాపా ఎంపీలు.. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2:02 గంటలకు దీక్ష ప్రారంభించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ అదే పార్లమెంట్ వేదికగా పోరాటానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత – వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లయ్యింది.