Home రాజకీయాలు బాబు ప్రభుత్వాన్ని కడిగేసిన కరణం

బాబు ప్రభుత్వాన్ని కడిగేసిన కరణం

SHARE

సొంత ప్రభుత్వంపైనే టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశం జిల్లా పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపై శాసనమండలిలోనే ధ్వజమొత్తారు. ప్రకాశం జిల్లాను 13 జిల్లా ఏపీ మ్యాప్‌ నుంచి తొలగించారా అంటూ ప్రశ్నించారు.

దొనకొండను రాజధాని చేస్తారనుకుంటే అమరావతి తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. అయినా సరే దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో అంగీకరిస్తే ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమను కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.

అసలు ఇప్పటి వరకు దొనకొండలో పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని మంత్రిని ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి… దొనకొండలో పరిశ్రమల ఏర్పాటుకు ఒక్క ప్రతిపాదన కూడా రాలేదన్నారు. దీంతో కరణం మరింత ఆగ్రహించారు.

పది కిలోమీటర్లు కాలువ తవ్వితే నాగార్జున సాగర్‌ నుంచి నీరు కూడా వస్తాయని.. అలాంటి ప్రాంతంలో ఎందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదన్నారు. దొనకొండలో బ్రిటీష్‌ కాలంలోనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసిన అంశాన్ని గుర్తు చేశారు.

వచ్చిన పారిశ్రామికవేత్తలను తిరుపతి, వైజాగ్, గన్నవరం తీసుకెళ్తుంటే ఇక ప్రకాశం జిల్లాలో ఎవరు పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. జిల్లా ప్రజలకు టీడీపీ నేతలమైన తాము ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు. సొంత పార్టీ ఎమ్మెల్సీనే ఈ స్థాయిలో విరుచుకుపడడంతో మంత్రులంతా మౌనంగా ఉండిపోయారు.