Home రాజకీయాలు ఈ ప్రశ్న జనాలు వింటే కొడతారు లోకేష్!

ఈ ప్రశ్న జనాలు వింటే కొడతారు లోకేష్!

SHARE

సీనియర్లా, జూనియర్లా అని కాదు కానీ… ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ప్రజా జీవితంలోకి అడుగిడిన తర్వాత.. మాట్లాడే ప్రతిమాట, చేసే ప్రతిపని ఆలోచించి చేయాలి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో తనదైన రాజకీయ పరిపక్వతతో ఇప్పటికే పలుమార్లు నోరు జారారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతిమయమైన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ అన్న రాజకీయ ప్రసంగం ఆయన సొంతం. ఈ ప్రాంతంలో తాగునీటి కరువు రప్పించడమే టీడీపీ లక్ష్యం అనడం ఆయనకే చెల్లింది. వర్ధంతికీ, జయంతికీ తేడా తెలుసుకోలేని జ్ఞానం ఆయన సొంతం! ఈ క్రమంలో మరోసారి తనదైన కామెంట్ చేశారు లోకేష్!

పైన చెప్పుకున్నవన్నీ.. ఏదో హడావిడిలోనో, తనకు మాత్రమే సొంతమైన ప్రత్యేక జ్ఞానం వల్లో వచ్చేశాయి అనుకుని సరిపెట్టుకున్నా… తాజగా ప్రశ్నించిన విషయం మాత్రం అత్యంత హేయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకూ లోకేష్ ఏమన్నారంటే… “అసలు ప్రత్యేక హోదాకి, చంద్రబాబుకి సంబంధం ఏమిటండి” అని! ప్రతిపక్షాలు పొద్దున్న లేస్తే చాలు ప్రత్యేక హోదా పేరు చెప్పి చంద్రబాబుని విమర్శిస్తున్నాయి.. అసలు ప్రత్యేక హోదాకి, చంద్రబాబుగారికి ఏమిటి సంబందం. తిట్టాల్సివస్తే కేంద్రాన్ని తిట్టండి, మోడీని అనండి అంతే కాని బాబు గారికి ఏమిటి సంబందం అనే స్థాయిలో ఫైరవుతున్నారు లోకేష్ బాబు!!

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారనే కదా ఆరోజు మోడీని ఏపీ ప్రజలకు బాబు తగిలించింది. ప్రత్యేక హోదా వాగ్ధానం చేస్తూ.. హోదా ఇస్తామని హామీ ఇస్తున్న క్రమంలో అంతా కలిసి వేదికలపై చేతులు పైకెత్తి ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి లోకేష్ మరిచారా? మీకూ మీకూ బాగున్నప్పుడు రాసుకు పూసుకు తిరిగి, జనాలకు వాగ్ధానాలు చేసి.. మీకూ మీకు చెడిన తర్వాత… వారు మోసం చేశారు, మాకేం సంబందం అని టీడీపీ నేతలు చెప్పడం కంటే నీచమైన పని మరొకటి ఉంటుందా? ఈ సాహసం చేశారు లోకేష్!! బీజేపీ మోసం చేసింది అని చెప్పుకోవడం టీడీపీ రాజకీయ సమర్ధింపు కావొచ్చు.. కానీ జనాలకు తన అనుభవాన్ని, మోడీతో తనకున్న స్నేహాన్ని ఎరగా వేసి, నమ్మించి గద్దె నెక్కిన తర్వాత ఇలా ప్లేటు ఫిరాయించి… మాకెం సంబంధం అని మాట్లాడటాన్ని ఏమనాలి?

రాష్ట్రాన్ని ఈ పరిస్థితుల్లో ఉద్దరించేది, మోడీతో కలిసి సింగపూర్ ని చేసేది, ప్రత్యేక హోదా తెచ్చి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేది చంద్రబాబే అని 2014 ఎన్నికల్లో వాగ్ధానాలు చేసిన టీడీపీ ఈ రోజు ఇలా మాట్లాడటాన్ని ఏమనాలి? మోడీ – బాబు ద్వయం ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు అని చెప్పిన మాటలు ఏమయ్యాయి. మోడీకీ బాబుకీ ఎందుకు చెడింది అనేది జనాలకు ప్రస్తుతానికి అవసరం లేకపోవచ్చు.. కానీ మోడీ అన్యాయం చేసినా, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ఆ నేరం చంద్రబాబుదే, ఆ చేతకాని తనం బాబుకే ముట్టచెప్పబడుతుంది. ఈ విషయం మరిచిన లోకేష్ బాబు మాటలు విన్న జనం మాత్రం.. ఊసరవిల్లులు సైతం జడుచుకునే స్థాయిలో రంగులు మార్చడం అంటే ఇదే కదా!!

దేవుడు నోరిచ్చాడు కదా అని, ఇచ్చిన నాలుకకు నరం లేదు కదా అని ఏదిబడితే అది అధికార గర్వంతో మాట్లాడితే… జనాలు మమ్మల్ని ఏమి చేయగలరులే అని భావిస్తే… అలాంటి నేతల పరిస్థితి పాత ఫోటోలు తిరిగేసుకుని చూడాల్సిందే!!