Home రాజకీయాలు జుట్టు పీక్కున్న జాతీయ మీడియా

జుట్టు పీక్కున్న జాతీయ మీడియా

8681
SHARE

ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు దెబ్బకు జాతీయ మీడియా ప్రతినిధులు తికమకపడ్డారు. మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలను సూటిగా సంధించినా చంద్రబాబు మాత్రం వాట్‌ ఐయామ్ సేయింగ్ అంటూ ఎటో తీసుకెళ్లారు. చివరకు మీడియా ప్రతినిధులే అసలు మీడియా సమావేశం ఎందుకు పెట్టారో అర్థం కాక తికమకపడ్డారు.

రెండో రోజు ఢిల్లీ పర్యటనలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు … తొలుత మోడీ ఏపీకి ఎలాంటి హామీలు ఇచ్చారన్న దానిపై వీడియోలను ప్రదర్శించారు. అనంతరం బీజేపీని , కేంద్రాన్ని తప్పుపడుతూ పలు వ్యాఖ్యాలు చేశారు. ఆఖర్లో విలేకర్లు ప్రశ్నలు సంధించగా చంద్రబాబు.. తనదైన ఇంగ్లీష్‌తో వారిని తికమకపెట్టారు.

అవిశ్వాసతీర్మానాన్ని అడ్డుకుంటున్న అన్నా డీఎంకే ఎంపీలు మాట్లాడుతారా అని విలేకర్లు ప్రశ్నించగా… ఒకప్పుడు తాము కూడా తమిళనాడులోనే ఉండేవారిమని చెప్పారు. తెలుగు గంగ ద్వారా తమిళనాడుకు నీరిస్తున్నామని చెప్పారు. ఆ రాష్ట్రంలో ఇంకా మెరుగైన సంబంధాలు కొనసాగిస్తామంటూ పొంతన లేకుండా సమాధానం ఇచ్చారు.

వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్షకు దిగుతున్నారు కదా మీ ప్రణాళిక ఏంటని ప్రశ్నించగా… మేం ఇక్కడే ఉండాలి పోరాడుతాం. రాజీనామాలు చేయం. కొందరు వేరేలా చేస్తున్నారు. అది రాష్ట్రానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. తమకు జాతీయ మీడియా సహకారం కూడా కావాలని చంద్రబాబు చెప్పారు. ఇలా మీడియా ప్రతినిధులు ఎంతగా ప్రశ్నించగా.. తాను ఏ విధంగా కేంద్రంపైపోరాటం చేస్తానో మాత్రం చంద్రబాబు చెప్పలేదు. పోరాటం చేస్తాం అని మాత్రమే పదేపదే చెప్పారు.

రాజకీయం కోసమే ఎన్‌డీఏనుంచి బయటకు వచ్చారని ఆరోపణ చేయడం సరికాదన్నారు. నాలుగేళ్లు తమతో కలిసి ఉండి ఇప్పుడు సడన్‌గా ఏపీ ప్రభుత్వం అవినీతిమయం అయిందని ఎలా అంటారని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు మాట్లాడితే క్రెడిబులిటీ ఉండాలన్నారు చంద్రబాబు.

కేంద్రం ఏపీ కంటే తెలంగాణ పట్లే సానుకూలంగా ఉందని భావిస్తున్నారా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగానే.. చంద్రబాబు మరోసారి హైదరాబాద్‌ గురించి మాట్లాడారు. హైదరాబాద్‌ను కట్టింది తానేనని చెప్పారు. అందుకే హైదరాబాద్‌లో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. చాలా మంది తనను కలిసినప్పుడు హైదరాబాద్‌ను కట్టారు.. అమరావతిని కడుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారని పదేపదే ప్రశ్నిస్తుంటారని చంద్రబాబు వివరించారు.

ఒక్క అమరావతే కాదు.. మరో నగరాన్ని కూడా నిర్మించే సత్తా తనకు ఉందని జాతీయ మీడియాతో చంద్రబాబు చెప్పారు. తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని.. తన లాంటి నాయకులు అవసరం దేశానికి చాలా ఉందని చంద్రబాబు చెప్పారు. జయలలిత, కరుణానిధి కూడా గొప్పనాయకులేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే జాతీయ మీడియా ప్రతినిధులు ఎంతగా ప్రయత్నించినా… కేంద్రంపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది మాత్రం చంద్రబాబు చేత చెప్పించలేకపోయారు.