Home రాజకీయాలు ఏపీతో పోయేది.. ఢిల్లీ వరకూ తెచ్చుకున్న బాబు!

ఏపీతో పోయేది.. ఢిల్లీ వరకూ తెచ్చుకున్న బాబు!

SHARE

ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఏమాత్రం బాగాలేదనేది జగమెరిగిన సత్యం! ఒకపక్క విపరీతంగా పెరిగిపోతుందని చెబుతున్న అవినీతి.. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాల విమర్శలు.. పోలవరం, పట్టిసీమ పేరు చెప్పి చేసిన ఘనకార్యాలు.. బాబు పాలనలో మహిళలకు, మహిళా ఉద్యోగులకు రక్షణ లేని వైనం.. గాలికి వదిలేసిన ఎన్నికలనాడు చేసిన వాగ్ధానలు.. జాడలేని నిరుద్యోగ భృతి.. గ్రాఫిక్సులకు పరిమితమైన అమరావతి.. తాజాగా ప్రత్యేక హోదా.. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే! వీటన్నింటితో ఏపీలో బాబు పరిస్థితి. “గతమెంతో ఘనం.. వర్తమానం గందరగోళం.. భవిష్యత్తు ప్రశ్నార్ధకం” అన్నట్లుగా మిగిలిపోయిందనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో.. ఢిల్లీకి బయలుదేరారు చంద్రబాబు!!

ఏపీకి ప్రత్యేక హోదా లేకపోయినా పర్లేదు.. ప్యాకేజీ చాలా బాగుంది, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని ప్రకటించుకున్న బాబు… తాజాగా ప్రజా ఒత్తిడికి, జగన్ అవిశ్రాంత పోరాటానికి తలొగ్గి “ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు” అని కొత్త గొంతెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రెడిట్ గేం లో భాగంగా ఢిల్లీ వెళ్లిన బాబు.. గాంధీ విగ్రహానికి నమస్కరించడం, పార్లమెంటు మెట్లకు మొక్కడం దగ్గరనుంచి తన స్థాయిని తాను పూర్తిగా తగ్గించేసుకున్నారనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. నమస్కరించడం, మొక్కడం ఎవరి ఆత్మ సంతృప్తి మేరకు వారు చేసేదే తప్ప.. కెమేరాలకోసం కాదని కౌంటర్స్ ఎప్పుడో పడిపోయాయి. అనంతరం జాతీయ స్థాయి నేతలకు కలుసుకునే ప్రయత్నం చేశారు బాబు!

ఇక్కడ మరో హాస్యం… ఎవరు పలకరిస్తున్నారు, పలకరించడం లేదు.. ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు.. అని ఏమాత్రం ఆలోచించని బాబు, కనిపించిన చోటా మోటా నాయకులందరిని కలిసి ఫోటోలు దిగారు. వారితో ఏమి మాట్లాడారు.. వారితో మాట్లాడటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి.. అనే విషయాలు బాబుకు ప్రస్తుతానికి అప్రస్తుతం. కావాల్సింది నెంబర్ గేం, పబ్లిసిటీ స్టంట్! అక్కడివరకూ వెళ్లిన బాబు ప్రధానిని, రాష్ట్రపతిని, అరుణ్ జైట్లీని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, వీలైతే స్పీకర్ ను.. ఇలా ఒకరి తర్వాత ఒకరిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పరిస్థితి చక్కబెట్టాల్సింది పోయి… ఎవరుపడితే వారిని కలిసి నెంబర్ చెప్పుకోవడం వల్ల ఒరిగేది ఏమిటో బాబే చెప్పాలి!!

ఈ క్రమంలో జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు, పార్లమెంటు సెంట్రల్ హాల్ల్ లో పలువురు నేతలు అడిగిన ప్రశ్నలకు బాబు ఫేస్ చూసిన తమ్ముళ్లు మాత్రం… “ఏపీతో పోయేది ఢిల్లీ వరకూ తెచ్చుకున్నారు” అని పక్కకు తిరిగి ఫీలవుతున్నారట! దానికి కారణం.. “నాడు మీరు లేఖ ఇచ్చిన అనంతరమే రాష్ట్ర విభజన జరిగింది” అని కాంగ్రెస్ నేతలు అంటుంటే… “హోదా లేకపోయినా పర్లేదు.. ప్రత్యేక ప్యాకేజీకి సరే అని మీరు నాడే ఒప్పుకుని, మరల ఏమిటి ఈ యూ టర్న్ లు” అని బీజేపీ నేతలు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారట. ఏపీలో ప్రతిపక్షాలు ఇదే ప్రశ్నలు వేస్తే… ఏదోలా ఎదురుదాడి చేసి సైడ్ అయిపోవచ్చు… కానీ ఢిల్లీలో వారే డైరెక్టుగా ముఖం మీద ఇలాంటి సూటి ప్రశ్నలు వేసే సరికి బాబు పరిస్థితి మామూలుగా లేదంట!! దీంతో… ఈ టూర్ అనంతరం “గతంలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన బాబు” అనే మాట ఇంకెప్పుడు తెలుగుదేశం నేతలు ప్రస్థావించరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి!!