Home రాజకీయాలు 30వసారి… మిగిలేది ఏమిటి?

30వసారి… మిగిలేది ఏమిటి?

SHARE

ఎంత మొండికేసిన నాయకుడైనా, ఎంత నియంత మార్కు పాలన చేసే నాయకుడైనా.. ప్రజాస్వామ్యంలో ప్రజల ఒత్తిడికి, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గక తప్పదు అని మరోసారి నిరూపించిన విషయం ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం. హోదా సంజీవని కాదు, హోదా ముగిసిన అధ్యాయం అని పలికిన నోరే.. ఈ రోజు మైకుల ముందుకువచ్చి.. “ప్రత్యేక హోదా కావాలి” అని అంటున్నాయంటే అదే ప్రజాస్వామ్యం ప్రత్యేకత. ఈ ప్రజాస్వామ్య ఒత్తిడికి తలొగ్గక తప్పని నాయకుడు చంద్రబాబు. అవును… ప్రతిపక్షాల ఒత్తిడికి, ప్రజల ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు గత కొన్నిరోజులుగా ప్రత్యేక హోదా పేరు చెప్పి హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా 30వసారి ఢిల్లీలో అడుగుపెట్టారు చంద్రబాబు!

అయితే… బాబు ఢిల్లీ వెళ్తున్నారు.. వెళ్లారు.. దిగారు.. అంటూ తమ్ముళ్లు, మీడియా హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే… తాను ఢిల్లీ వెళ్లింది ఎందుకు అనే విషయం గాంధీ విగ్రహానికి, పార్లమెంటు మెట్లకు దండాలు పెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చినప్పుడే బాబు చెప్పకనే చెప్పారని స్పష్టమవుతుంది! రాష్ట్రం కోసం 30వ సారి ఢిల్లీ వెళ్లిన బాబు.. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో కథం తొక్కిన బాబు.. అని చెప్పించుకునే తాపత్రయమే కనిపిస్తుంది తప్ప.. పోరాటంలోనూ, ప్రయత్నంలోనూ నిజాయితీ లోపించిందనే విశ్లేషణలు అప్పుడే మొదలైపోయాయి. కేవలం ప్రచారం కోసం, ప్రజాగ్రహం నుంచి ఎంతో కొంత తప్పించుకోవడం కోసం, ఇదే అదనుగా ఎన్డీయే నుంచి తప్పుకున్న కారణంగా ఏర్పరచుకోవాల్సిన కొత్త స్నేహాల కోసం అనే కామెంట్స్ జాతీయస్థాయిలో మొదలైపోయాయి!

ఉండవల్లి సూచించినట్లుగా కేవీపీ, ఉండవల్లి సుప్రీంలో వేసిన రిట్ కు కౌంటర్ దాఖలు చేస్తే ప్రయోజనం ఉంటుంది అన్న సంగతి తెలిసిందే! ఆ విషయంలో బాబు కనీసం స్పందించరు.. అలా అని ఖండించరు! ఇక జగన్ సూచించినట్లుగా 25మంది ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ఆ వేడి దేశం మొత్తాన్ని తాకుతుందంటే.. దానికీ కలిసిరారు. తెలుగు ఎంపీలంతా ఆమరణ నిరాహారదీక్ష చేద్దాం అని పిలుపునిస్తే మౌనమే వారి బాషగా చేసుకుంటారు. ఇది బాబుకు ఉన్న చిత్తశుద్ధి!! బాబుకు కావాల్సింది ప్రత్యేక హోదాకాదు, కేంద్రంపై నిజాయితీతో కూడిన పోరాటమూ కాదు! క్రెడిట్… అవును.. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎంతో చేశారు, ఢిల్లీ వెళ్లారు, గాంధీ విగ్రహానికి నమస్కరించారు, పార్లమెంటు మెట్లకు మొక్కారు, చాలా మంది నేతలతో మాట్లాడారు… ఈ క్రెడిట్ చాలు బాబుకు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి!!

ఏది ఏమైనా… ఇప్పటికి 29 సార్లు ఢిల్లీ వెళ్లాను అని 99సార్లు పైగా చెప్పుకున్న బాబు అండ్ కో… తాజా పర్యటన అనంతరం ప్రజలకు చెప్పబోయే మాటలపై ఆసక్తి నెలకొంది. 30వసారి ఢిల్లీ వెళ్లిన బాబు, ఏపీ ప్రజలకు ఏమి చెప్పబోతున్నారు, కేంద్రం మెడలు ఎలా వంచారని చెప్పబోతున్నారు, జాతీయస్థాయిలో బీజేపీయేతర శక్తులన్నింటినీ ఏకతాటాటిపైకి తేవడంపై ఏమి చెప్పబోతున్నారు… ఇవే ప్రశ్నలు సామాన్యుల మదిలో మెదులుతున్నాయి!! అలా కాకుండా… 30వసారి కూడా మైకులముందుకువచ్చి.. అందరితోనూ మాట్లాడాను.. కేంద్రం మనల్ని మోసం చేసింది.. వంచనకు గురిచేసింది.. రాష్ట్రానికి కావాల్సిన వాటిని ఇవ్వాలని కోరాం.. ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడాం.. కేంద్రం సానుకూలంగా స్పందించింది.. మోడీ ససేమిరా అన్నారు.. రాష్ట్రం కోసం ఎంతదూరం అయినా వెళ్తాను.. రాష్ట్రాభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదు.. వంటి మాటలే చెబితే మాత్రం.. బాబుని ఏపీవాసులు క్షమించరనేది జగమెరిగిన సత్యమే!!