Home రాజకీయాలు అదేదో చేసి చూపించు సీఎం రమేశ్!

అదేదో చేసి చూపించు సీఎం రమేశ్!

1117
SHARE

మాటలకు, చేతలకూ ఉన్న తేడా ఎంతనేది దాదాపుగా అందరికీ తెలిసినా.. చాలా మందికి తెలియని పరిస్థితి!! నిజమైన సంకల్పానికి, సానుభూతి కోసం చేసే చౌకబారు పనులకు ఉన్న తేడా మామూలిది కాదు!! నిజమైన పోరాటం చేయడానికి, మీడియా ముందు ఫోటోలకు ఫోజులివ్వడానికి ఉన్న వ్యత్యాసం చిన్నది కాదు!! ఈ విషయాలు మరిచిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాత్రం.. ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతుందంట అన్న సామెతను గుర్తుచేస్తున్నారు. విమర్శించామా లేదా అన్నదే ముఖ్యం కానీ వాస్తవాలతో సంబందం లేదు.. సవాళ్లు చేశామా లేదా అన్నదే ముఖ్యం కాని చివరి వరకూ నిలబడేదీ లేదు.. ప్రస్తుతం ఇలా సాగిపోతుంది టీడీపీ రాజకీయం అనే కామెంట్స్ వినిపిస్తున్నా… సీఎం రమేశ్ దోరణిలో మార్పు కనిపించడంలేదు! పైగా ఈ వాదనను బలపరిచే పలుకు ఒకటి పలికారు తాజాగా!

ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే పోరాటాన్ని పీక్స్ కి తీసుకెళ్లిన జగన్… తన ఎంపీలతో ఆమరణ నిరాహార దీక్ష చేయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలపై స్పందించిన సీఎం రమేష్… చంద్రబాబు ఢిల్లీ వస్తున్న నేపథ్యంలో దీన్ని పక్కదోవపట్టించేందుకు ఆమరణ దీక్ష చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. సరే.. ఎవరి ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే కదా అని లైట్ తీసుకునే లోపు మరో మాట మాట్లాడారు రమేశ్.

ఆమరణ నిరాహార దీక్ష చేయాలని వైకాపా ఎంపీలు చెబుతున్నారు… తాము తలచుకుంటే పీఎం ఇంటిముందు కూడా ధర్నా చేయగలం అని ప్రకటించారు సీఎం రమేష్. ఆయన మాటలు వినడానికి బాగానే ఉన్నాయి కానీ… పీఎం నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేసే సత్తా టీడీపీ ఎంపీలకు ఉందా అనేది పెద్ద ప్రశ్న! రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా.. పార్లమెంటులోనూ, ప్రధానిముందూ పోరాడటమే అని పైకి చెప్పుకుంటున్నా.. పార్లమెంటు ఆవరణలో పీఎం కనిపిస్తేనే సాగిలపడి చేతులు పిసికే జనాలు… పీఎం ఇంటిముందు ధర్నా చేసే సత్తా గురించి మాట్లాడం హాస్యాస్పదంగా ఉందని సోషల్ మీడియాలో సెటర్లు హల్ చల్ చేస్తున్నాయి.

నిజంగా ఏపీవాసులెవ్వరికీ తెలియని విషయం… టీడీపీ నేతలకు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసే సత్తా ఉందనేది! నిజంగా ఈ విషయం నిజమే అయితే… చంద్రబాబు తో సహా మిగిలిన టీడీపీ ఎంపీలంతా ఎందుకు కాలం వృథా చేస్తున్నట్లు… అనుకున్నదే తడవుగా “ఏపీకి ప్రత్యేక హోదా కావాలి” అని నినదిస్తూ.. “ప్రధాని ఏపీకి అన్యాయం చేశారు” అని గర్జిస్తూ.. మోడీ ఇంటి ముందు 10 నిమిషాలు ధర్నా చేయగలిగితే.. ఏపీవాసులంతా హర్షిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు మించిన సదావకాశం మరలా దొరకదని మరికొందరు సూచిస్తున్నారు.

చేసేవాళ్లను చేయనివ్వరు.. వారు చేయలేరు.. ఇది టీడీపీ నేతల పరిస్థితి! అలుపెరగకుండా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పోరాటం చేస్తున్న వైకాపా ఎంపీలకు సహకరించేది ఎలాగూ లేదు.. సరికదా ఇలాంటి గాలి కబుర్లకు లోటూ లేదు!! ఏమిటి తమ్ముళ్లూ ఇది.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు!!