Home రాజకీయాలు ఎంపీల రాజీనామా.. ఆమరణదీక్ష ప్రకటనతో వేడెక్కిన ఢిల్లీ

ఎంపీల రాజీనామా.. ఆమరణదీక్ష ప్రకటనతో వేడెక్కిన ఢిల్లీ

1054
SHARE

అపర సంజీవని వంటి ప్రత్యేకహోదా కోసం ఎంపీలు రాజీనామా చేస్తారని, ఆ వెంటనే ఆంధ్రుల ఆస్తి అయిన ఏపీ భవన్‌లో ఆమరణదీక్ష చేస్తారని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం హస్తినలో పెను సంచలనంగా మారింది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందా అని అన్ని రాజకీయ పార్టీలలోనూ దీనిపై చర్చ జరుగుతోంది. నాలుగురోజుల విరామం తర్వాత మరలా నేడు పార్లమెంటు సమావేశమౌతుండటంతో ఏం జరగనుందనే దానిపై అందరూ ఆసక్తితో ఉన్నారు. ఆరాతీస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిదోసారి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని సోమవారమైనా చర్చకు స్వీకరిస్తారా లేక యథాప్రకారం సభను వాయిదా వేస్తారా అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. అందుకే అందరి దృష్టి లోక్‌సభపైనే కేంద్రీకృతమయ్యింది. పట్టు వదలకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఇప్పటికి తొమ్మిదిసార్లు అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చింది.

ఎంపీలు రాజీనామాలు చేయడంతోపాటు ఏపీ భవన్‌లో ఆమరణ దీక్ష చేస్తారని వైఎస్‌ జగన్‌ ప్రకటించడంతో ఏం చేయాలో దిక్కుతోచక టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ విషయంలో కూడా వైఎస్సార్‌ సీపీ బాటలోనే నడిచి ఢిల్లీలో దీక్షకు దిగితే మేలని, అయితే ఆ క్రెడిట్‌ దక్కించుకోవడం కోసం ఏం చేయాలనేదానిపై టీడీపీ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అందరం రాజీనామాలు చేద్దాం రండి.. ఆమరణదీక్షకు కూర్చుందాం రండి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఇచ్చిన పిలుపుపై మాత్రం టీడీపీ నోరుమెదపడం లేదు. అవిశ్వాసంపై ఆడినట్లే ఇపుడు కూడా ఏదైనా నాటకం మొదలుపెడతారా లేక రాజీనామాలకు, ఆమరణదీక్షకు సిద్ధపడతారా అనేదాన్నిబట్టి వారి చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోతుందని విశ్లేషకులంటున్నారు.