Home రాజకీయాలు మైకులముందు మేకపోతు గాంభీర్యం!

మైకులముందు మేకపోతు గాంభీర్యం!

SHARE

మీడియా మైకుల ముందు అరిసే అరుపులకూ.. సృష్టించే మెరుపులకు, వాస్తవాలకు ఎంత వ్యత్యాసం ఉంటుందో తాజాగా నిరూపించారు టీడీపీ నేత సీఎం రమేష్! అసలు విషయాలకంటే కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తూ, పనికిమాలిన విషయాల ప్రస్థావన తీసుకువచ్చి, హోదా అంశాన్ని సైడ్ చేయాలని తపిస్తున్న టీడీపీ ఎంపీలు… విజయసాయి రెడ్డి.. ప్రధాని మోడీ కాళ్లకు నమస్కారం చేశారని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై తనదైన శైలిలో ఫైరయిన విజయసాయి రెడ్డి… సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలని, తాను పాదాభివందనం చేయలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైకులముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే పద్దతిని నిరూపించే ప్రయత్నం చేశారు సీఎం రమేష్.

విషయానికొస్తే… రాజ్యసభలో జరగరానిది ఏదో జరిగిందంటూ కట్టుకథ అల్లిన హడావిడి చేసిన టీడీపీ ఎంపీల అసలు స్వరూపం బయటపడింది. ప్రధానికి విజయసాయిరెడ్డి పాదాభివందనం చేశారంటూ చేసిన తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మైకుల ముందు హడావిడి చేయడానికి వచ్చిన సీఎం రమేష్… తొలుత సభలో ఏదో జరిగిందంటూ మీడియాతో మాట్లాడి.. తర్వాత మాట్లాడేందుకు మరో ఎంపీ మురళీ మోహన్‌ కు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ఓ విలేకరి వైఎస్సార్‌ సీపీ ఎంపీల వాదనను ప్రస్తావించగా.. “సాక్ష్యాలిస్తే వాళ్లు రాజీనామా చేస్తారా?” అని ఆవేశంగా మాట్లాడారు రమేశ్. అంతలో జోక్యం చేసుకున్న మురళీమోహన్ కాస్త అమాయకంగా… “ఫుటేజీ ఉంది కదా!” అనటం.. “ఉంది.. ఉంది.. మీరు అది చెప్పొద్దు” అంటూ మురళీమోహన్‌ కు రమేశ్‌ సూచించటం స్పష్టంగా కనిపించింది. దీంతో రమేశ్‌ చేసే ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉన్నదన్నది అర్థమైపోతోంది!

ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది… మురళీమోహన్ చెప్పినట్లు నిజంగా సీఎం రమేష్ దగ్గర రాజ్యసభ ఫుటేజ్ ఉందా.. ఉంటే ఆ ఫుటేజ్ లో విజయసాయిరెడ్డి ప్రధానికి సాష్టాంగ నమస్కారం చేసినట్లు లేదా.. అని! ఎందుకంటే… నిజంగా విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలని నిరూపించే ఫుటేజ్ వారి వద్ద ఉంటే ఇంతసేపు ఆగాల్సిన పనిలేదు! ఎప్పుడో ఆ విషయం తమ మీడియా ద్వారా ఇప్పటికే దుమ్ములేపేసేవారు. అంటే… ఈ క్లిప్పింగ్ చూసినవారికి నిజంగా సీఎం రమేష్ దగ్గర రాజ్యసభకు సంబందించిన ఫుటేజ్ ఉండే ఉంటుందని, కానీ… అందులో వీరి ఆరోపణలకు బలం చేకూర్చే విషయం లేకపోయి ఉంటుందని అనుకోవాలి. ఇదంతా కేవలం మీడియా ముందు ప్రదర్శిస్తున్న మేకపోతు గాంభీర్యం గానే చూడాలి తప్ప.. వాస్తవాలకు దూరం అన్నమాట!!

అసలు మనం ఢిల్లీ ఎందుకు వెళ్లాం.. మనలను ప్రజలు పార్లమెంటు వరకూ ఎందుకు పంపారు.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మధ్య బాధ్యతాయుతమైన అధికారపక్షంగా చేయాల్సిన పనులు ఏమిటి… నాలుగేళ్లపాటు నాటకాలాడుతూ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ఎంతో కొంత న్యాయం ఎలా చేయాలి… అందరిని కలుపుకుని పోతూ కేంద్రంపై ఒత్తిడి ఎలా తేవాలి… ఇతర రాజకీయ పక్షాలతో ఎలా మాట్లాడి మద్దతు కూడగట్టాలి… అన్నాడీఎంకే వాళ్లను ఎలా బుజ్జగించి అవిశ్వాసం జరిగేలా చూడాలి… వంటి విషయాలపై దృష్టి సారించకుండా ఇలాంటి పనికిమాలిన విషయాలపైనా, ప్రజలకు ఏమాత్రం అవసరంలేని అంశాలపైనా మైకుల ముందుకొచ్చి మేకపోతు గాంభిర్యాలు పలకడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి!