Home రాజకీయాలు బాబుకు దిమ్మతిరిగే ప్రశ్నలివిగో!

బాబుకు దిమ్మతిరిగే ప్రశ్నలివిగో!

696
SHARE

నిన్నటివరకూ అది సంజీవని కాదన్న నోరే.. ఇప్పుడు అదే సంజీవని అంటుంది! హోదా గురించి పోరాడుతున్నవారిపై లాఠీ ఎత్తిన చెయ్యే.. ఇప్పుడు హోదాకోసం పోరాడుతున్నామంటుంది! ఏమాటనమ్మాలి, ఎప్పుడు మాట్లాడిన మాటకు విలువివ్వాలి? ఇవన్నీ తాజాగా ప్రత్యేక హోదా విషయంలో హడావిడి చేస్తున్న చంద్రబాబుకు ఎదురవుతున్న ప్రశ్నలు! అవును… చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై గతిలేని పరిస్థితుల్లో తలొగ్గారు, పోరాడుతున్నాం అని ముందుకొచ్చారు. వచ్చినాయన సైలంటుగా ఆపని మాత్రమే చేయకుండా.. ఇంతకాలం ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని సజీవంగా ఉంచిన పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు.. పోరాడుతున్నవారిపై సెటైర్లు వేస్తున్నారు.. నిలబెట్టే ప్రయత్నం చేసినవారిపై ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలకు, నేతలకు చంద్రబాబు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆంధ్రా పక్షమా? కేంద్రం పక్షమా? అన్నది ఆయా పార్టీల నేతలే తేల్చుకోవాలని.. ప్రజల కోసం పోరాడే ముఖ్యమంత్రి పక్షాన ఉంటారా? రాష్ట్రానికి అన్యాయం చేసే కేంద్రం పక్షాన ఉంటారా? అని అడుగుతూ.. ప్రజల హక్కుల కోసం పోరాడే టీడీపీ పక్షాన ఉంటారా? ప్రజల మనోభావాలను నిర్లక్ష్యం చేసిన బీజేపీ వైపు ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. అక్కడితో ఆగని బాబు… ఏకంగా తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తే రాష్ట్రానికి మద్దతివ్వడమే అని చెప్పేశారు!

ఈ ప్రసంగం అనంతరం బాబుకు ప్రజలనుంచి ఎదురైన మొదటి ప్రశ్న… ఈ ప్రశ్నలు మీకు మీరే ఒకసారి వేసుకుని చూడండి.. అని!

* అవును.. ఇంతకాలం ప్రజల పక్షాన్న ఉన్నదెవరు, తమ పార్టీ మాత్రమే ముఖ్యమని ఉన్నదెవరు?

* ఇంతకాలం ప్రత్యేక హోదా కోసం పోరాడింది ఎవరు.. కేంద్రం చాటున దాగి హోదాని చంపే ప్రయత్నం చేసింది ఎవరు?

* హోదా పోరాటాన్ని ఢిల్లీ వరకూ తీసుకెళ్లింది ఎవరు.. ఆ హోదా పోరాటం చేస్తున్నవారిపై లాఠీలు జులిపించింది ఎవరు?

* గత్యంతరం లేని తరుణంలో ప్రజాగ్రహం పెళ్లిబికిన పరిస్థితుల్లో.. బీజేపీకి ఏదో వంకతో దూరం అవ్వాలని.. హోదాపోరాటం పేరుచెప్పి తెగదెంపులు చేసుకుని, ఆ పోరాటం ప్రజలకోసం అని కలరింగ్ ఇచ్చింది ఎవరు?

* మిత్రపక్షం కదా అని మిత్రధర్మం పాటించి ఇంతకాలం మౌనంగా ఉన్నామని.. తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు మిత్రధర్మం అని పేరుపెట్టి.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరు?

* కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీ మంత్రులున్నా కూడా.. నాలుగేళ్ల చేతకాని తనాన్ని ప్రదర్శ్నించింది ఎవరు?

* హోదా లేదు ప్రత్యేక ప్యాకేజీ అంటే.. అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంపై ప్రశంశల వర్షాలు కురిపించింది ఎవరు?

* ఇప్పటికిప్పుడు ఏదో జ్ఞానోదయం అయినట్లుగా.. తప్పులన్నీ తాను చేసి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి.. ఇప్పుడు విపక్షాలపై ప్రశ్నల వర్షాలు అంటూ మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు ఉందా?

చెయ్యాల్సిన నేరం అంతా తాను చేసి.. బీజేపీని తిట్టినంత మాత్రాన్న, కేంద్రం నుంచి మంత్రులను ఉపసంహరించుకున్నంతమాత్రాన్న, ఎన్డీఏ నుంచి వైదొలిగినంత మాత్రాన్న… చేసిన పాపం ఊరికే పోతుందా? జరిగిన అన్యాయం మాసిపోతుంది?

ప్రజలకు రేపటిపై ఎంత ఆశ, నమ్మకం ఉంటుందో.. అలానే నిన్న జరిగిన విషయాలపై అంత ఆగ్రహం కూడా ఉంటుంది కదా! ఈ విషయాలు జనాలకు తెలియదు అనే ప్రగాడ నమ్మకంతో ముందుకుపోతున్న చంద్రబాబు… హోదా గురించి తాను మాత్రమే పోరాడుతున్నామని, తనకు మద్దతిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు మద్దతిచ్చినట్లే అని మాట్లాడం హాస్యం కాక మరేమిటి?