Home రాజకీయాలు బాబు బండారం బయటపెట్టిన ఆర్కే!

బాబు బండారం బయటపెట్టిన ఆర్కే!

SHARE

కొన్ని సందర్భాల్లో తెలియక చేస్తారో, అతి తెలివితో చేస్తారో కానీ.. తెగ పొగిడేయాలనో, భారీగా వెనకేసుకురావాలనో తెలియదు కానీ ఒక్కోసారి బురదలో కాలేసి, తమ నాయకుడికి అంటిస్తుంటారు భజన బ్యాచ్! ఈ విషయంలో దాదాపు అలాంటి పనే చేశారు ఏబీఎన్ రాధాకృష్ణ! ఏది ఏమైనా సరే బాబును అడ్డంగా వెనకేసుకు రావడమే పరమావధిగా నడుస్తున్నాయి అనే పేరు మూటగట్టుకున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ లలో వీకెండ్ కామెంట్ అంటూ రాధాకృష్ణ ఒక ఆర్టికల్ రాయడం, ఒక ప్రోగ్రాం చేయడం తెలిసిందే! తాజాగా విడుదల చేసిన ఈ “వీకెండ్ కామెంట్ బై ఆర్కే” లో బాబును పొగిడే క్రమంలో అడ్డంగా ఇరికించేశారు.. బాబు గుట్టు బయటపెట్టేశారు!

ఇంతకూ విషయం ఏమిటంటే… రాధాకృష్ణ తన తాజా ఆర్టికల్ లో… “ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య విభేదాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దక్షిణాదిన ముఖ్యమంత్రి చంద్రబాబు బలంగా ఉండటం కమలనాథులకు సహజంగానే ఇష్టం ఉండదు. ఈ కారణంగానే వచ్చే ఎన్నికలలో తమకు 10 లోక్‌ సభ స్థానాలు, 50 వరకు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కాషాయదళం నుంచి తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి వచ్చింది” అని రాసుకొచ్చారు! అంటే రాధాకృష్ణ చెప్పాలనుకున్న కారణాల్లో తనకున్న సమాచారం ప్రకారం ఇది కూడా ఒక ప్రధాన కారణం అనే అనుకోవాలి. ఇక్కడే ఉంది అసలు మెలిక!

ఇంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా రావాలని పోరాడుతున్న ప్రజలకు మద్దతుగా, ప్రజానాడికి విలువిచ్చి, ప్రతిపక్ష ఒత్తిడికి తలొగ్గి చంద్రబాబు కాస్త సీరియస్ అయినట్లు కనిపించారని, ప్రత్యేక హోదా పోరాటంలో కాస్త ఆలస్యంగా అయినా భాగస్వాములు అయ్యారని చాలామంది అనుకున్నారు అనే కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలో కేంద్రం, రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని కేంద్రప్రభుత్వం నుంచి మంత్రులను వెనక్కి తెచ్చేసుకున్నారు.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఇదంతా డ్రామా అని వైకాపా నేతలు ఆరోపించారనుకోండి అది వేరే విషయం. అయితే.. బాబు బీజేపీతో తెగ దెంపులు చేసుకోవడానికి, ఇప్పుడు ఇంతలా ఫైరవ్వడానికి కారణం హోదా పోరాటం కాదని, రాష్ట్ర ప్రయోజనాలకోసం అసలే కాదని స్పష్టమవుతుంది.

ఆర్కే కథనం ప్రకారం… రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు అడుగుతుందని, అందువల్ల ఆ పార్టీతో చివరి వరకూ అంటకాగి, చివరికి వచ్చే సరికి ఏదో ఒక వంకతో ఆ పార్టీని దూరం పెట్టాలని బాబు భావించారన్న మాట. ఈ క్రమంలో వైకాపా నేతలు, ప్రజా సంఘాలు, ప్రజలు, ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయంలో… తాము కూడా హోదా విషయంలో సీరియస్ గా ఉన్నాము అని చెప్పడానికీ ఉపయోగపడుతుంది, ఇటు బీజేపీని కట్ చేసినట్లూ ఉంటుందని.. బాబు ఈ “రాష్ట్రంకోసం, రాష్ట్ర ప్రయోజనాలకోసం, హోదా పోరాటం కోసం.. ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నాం” అనే ఆలోచన చేశారన్న మాట. ఈ విషయం తెలియని జనాల్లో కొంతమంది మాత్రం… అయ్యో రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజలకోసం చంద్రబాబు.. తన మంత్రులతో రాజీనామాలు చేయించారని, బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారని.. బాబు నిబద్దత అది అని భ్రమపడ్డారు!! కానీ… రాధాకృష్ణ తాజా ఆర్టికల్ పుణ్యమా అని ఈ విషయం స్పష్టంగా వెలుగులోకి వచ్చింది.. బాబు బండారం బయటపడింది!

అంటే… బాబు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా, కేంద్ర ప్రభుత్వంలో నుండి తమ మంత్రులతో రాజీనామాలు చేయించినా.. అది కేవలం రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు అడుగుతుందని, ఏదోలా కట్ చేయాలనే తప్ప… ప్రత్యేకహోదా పోరాటం కోసమో, ప్రజల కోసమో కాదన్నమాట!!