Home రాజకీయాలు ఈ బాబు పచ్చ బాబే అంటున్న రాధాకృష్ణ

ఈ బాబు పచ్చ బాబే అంటున్న రాధాకృష్ణ

SHARE

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ కోవర్ట్ అన్న ఆరోపణ గతంలో బలంగా వినిపించింది. చంద్రబాబుపై హైకోర్టు సీబీఐ దర్యాప్తు ఆదేశించినప్పుడు లక్ష్మీనారాయణ సిబ్బంది లేరంటూ మౌనంగా ఉండడం కూడా అందుకు బలాన్ని ఇచ్చింది. కొన్ని పార్టీల కనుసన్నల్లో సరైన ఆధారాలను సేకరించకుండానే పలువురు ఐఏఎస్‌ల జీవితాలను లక్ష్మీనారాయణ దెబ్బతీశారన్న ఆరోపణ ఐఏఎస్ వర్గాల్లో బలంగా ఉంది.  జగన్‌పై సీబీఐ దాడుల్లో ఉత్సాహంగా పనిచేసిన లక్ష్మీనారాయణ టీడీపీ సానుభూతిపరుడేనని ఏబీఎన్ రాధాకృష్ణే పరోక్షంగా నిర్దారించేశారు.

రాధాకృష్ణ తన వీకెండ్‌ కామెంట్‌లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. తాను జనసేనలో చేరుతానన్న ప్రచారాన్ని లక్ష్మీనారాయణ సన్నిహితుల వద్ద ఖండించారట. పవన్‌ కల్యాణ్‌ కింద తాను పనిచేయడం ఏమిటని ఆయన వ్యాఖ్యానించినట్టు రాధాకృష్ణ వివరించారు. జగన్‌పై సీబీఐ దాడుల సమయంలో టీడీపీ కనుసన్నల్లోనే లక్ష్మీనారాయణ పనిచేశారన్న అభిప్రాయానికి ఊతమిచ్చేలా మరో వ్యాఖ్య కూడా చేశారు ఏబీఎన్ రాధాకృష్ణ.

రాజకీయాల్లోకి రావాలన్న కోరిక లక్ష్మీనారాయణకు చాలా కాలంగానే ఉందన్న రాధాకృష్ణ… 2014 ఎన్నికల సమయంలోనే టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని లక్ష్మీనారాయణ భావించారని.. టీడీపీ వర్గాలకు దగ్గరగా ఉండే రాధాకృష్ణే చెప్పడం విశేషం. అయితే అప్పటి వరకు జగన్‌ కేసులపై దర్యాప్తు చేసి.. వెంటనే టీడీపీలో చేరితే కేసులు బలహీనపడుతాయని మిత్రులు సలహా ఇవ్వడంతో లక్ష్మీనారాయణ టీడీపీలో చేరకుండా వెనక్కు తగ్గారని బయటపెట్టారు. అయితే లక్ష్మీనారాయణలో టీడీపీ భావాలు చాలా గట్టిగానే ఉండేవన్న మాట.

వెంటనే టీడీపీలో చేరితే జగన్ కేసులు బలహీనపడుతాయన్న ఉద్దేశంతో 2014లో టీడీపీలో చేరకుండా లక్ష్మీనారాయణ మనసు కట్టేసుకున్నారన్న మాట. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మీనారాయణ బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువున్నాయని రాధాకృష్ణ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, జగన్‌ను ఎదుర్కోవడం పవన్ ఒక్కడితోనే సాధ్యం కాదని భావిస్తున్న బీజేపీ.. లక్ష్మీనారాయణను కూడా తెరపైకి తెస్తున్నట్టు రాధాకృష్ణ విశ్లేషించారు. మొత్తం మీద జగన్‌పై సీబీఐ దాడుల సమయంలో లక్ష్మీనారాయణ టీడీపీ సానుభూతిపరుడేనన్న విషయాన్ని రాధాకృష్ణ కూడా ధృవీకరించినట్టు అయింది.