Home రాజకీయాలు ఆ మాటలను జీవితంలో మరిచిపోలేను..

ఆ మాటలను జీవితంలో మరిచిపోలేను..

2217
SHARE

ఎన్నో ఆటంకాలు ఎదురైనా సరే వాటిని తట్టుకుని సాక్షి పత్రిక నిలబడిందని సాక్షి మీడియా చైర్ పర్సన్‌ వైఎస్‌ భారతి చెప్పారు. మరో వంద తరాలకు కూడా సాక్షి పత్రిక చేరాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సాక్షి పత్రిక ప్రారంభమై 10 ఏళ్లుపూర్తయిన సందర్భంగా సాక్షి సిబ్బందితో కలిసి ఆమె కేక్‌ కట్ చేశారు. ఈ సందర్భంగా భారతి తమకు ఎదురైన అనుభవాలను సిబ్బందితో పంచుకున్నారు.

పత్రిక మొదలైన మూడేళ్ల నుంచే దాడులు మొదలయ్యాయని చెప్పారు. సాక్షిని దెబ్బతీయడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరిగాయని.. కాని వాటిని తట్టుకుని నిలబడగలిగామన్నారు.

ఒక్కరోజు కూడా పత్రిక ఆగకుండా ప్రజల ముందుకు తీసుకొచ్చామని.. ఇదంతా సిబ్బంది, పాఠకుల సహకారంతోనే సాధ్యమైందన్నారు. సాక్షిపై సీబీఐ, ఈడీ దాడులు జరిగినప్పుడు ఎదురైన అనుభవాలను వైఎస్‌ భారతి పంచుకున్నారు. జగన్‌ అరెస్ట్ అయిన మూడో రోజు తాను సాక్షి ఆఫీస్‌కు వచ్చానని.. ఆ సమయంలో లిఫ్ట్‌ దగ్గర చారి, హసిన్‌తో పాటు ప్రతి ఒక్క ఉద్యోగి ఎదురొచ్చి ధైర్యం చెప్పారన్నారు.

మీరు జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదు.. మీకోసం పనిచేస్తాం… వెనకడుగు మాత్రం వేయవద్దని చెప్పారని భారతి గుర్తు చేసుకున్నారు. ఆరోజును తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని ఉద్వేగంగా ప్రసంగించారు. సాక్షి అన్నది ఒక ప్రయాణమే గానీ.. గమ్యం మాత్రం కానేకాదన్నారు.

మరో 100 తరాలకు కూడా ఈ ప్రతిక అందాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఆ దిశగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు సాగుతామన్నారు. 2014 తర్వాత కూడా సాక్షి పట్ల వివక్ష కొనసాగుతోందని ఆమె చెప్పారు. సాక్షి పత్రికకు ప్రకటనలు నిలిపివేయడం, సాక్షి విలేకర్లపై దాడులు చేయించడం వంటిని చేస్తూనే ఉన్నారని భారతి వ్యాఖ్యానించారు.