Home రాజకీయాలు కామెంట్: కన్నతల్లికి కూడెట్టలేని కేసీఆర్!!

కామెంట్: కన్నతల్లికి కూడెట్టలేని కేసీఆర్!!

SHARE

కన్నతల్లికి కూడెట్టలేని పెద్దమనిషి.. పినతల్లికి కోకెడతానన్నాడని ఒక సామెత. సరిగ్గా ఈ రోజు పార్లమెంటులో కేసీఆర్ ఎంపీలు చేసిన పనులు ఈ సామెతనే గుర్తుచేస్తున్నాయి. దేశం మొత్తం మీద కొత్త పాలన కావాలని, కొత్త ఫ్రంట్ రావాలని దేశం మొత్తం ఉద్దరించాలని తిరుగుతున్నట్లు ప్రకటించుకున్న కేసీఆర్… పక్కనున్న రాష్ట్రానికి, ఇంతకాలం కలిసున్న రాష్ట్రానికి, ఇప్పటికీ ఉమ్మడి రాజధాని కలిగి ఉన్న రాష్ట్రానికి సమస్య వచ్చి పార్లమెంటులో పోరాడుతుంటే.. కనీస మద్దతు ఇవ్వకపోవడం ఇప్పుడు ఆంధ్రులను ఎంతో కలిచివేస్తున్న విషయం.

ఈ విషయంపై స్పందించిన తెరాస ఎంపీలు… తమను ఎవరూ మద్దతు పలకమని అడగలేదని, పక్క రాష్ట్రాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పుకొస్తున్నారు. మా రాష్ట్రం ఎవరికీ సామంత రాష్ట్రం కాదని, స్వతంత్ర రాష్ట్రమని.. తమకు పక్క రాష్ట్ర పార్టీల గురించి అవసరం లేదని ప్రకటిస్తున్నారు. పక్క రాష్ట్రాల పార్టీల గురించి వారికి అవసరం లేకపోయినా… కనీసం పక్క రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలకు కనీస విలువ ఇవ్వాల్సిన కనీస బాధ్యత తెరాసకు లేదా అనేది పెద్ద ప్రశ్న.

మాకు ప్రజల అభిప్రాయమే ప్రాముఖ్యం అని చెప్పుకొస్తున్న తెరాస నేతలు.. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ప్రజల కోరికగా కనిపించకపోవడం వారి అజ్ఞానానికి నిదర్శనం అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా.. పక్క రాష్ట్రాల గురించే అవసరం లేని మీకు దేశం మొత్తం గురించి మాత్రం ఎందుకు అనే విమర్శల వర్షాలు కురుస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే… మద్దతు ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. ఇలా చెడగొట్టే కార్యక్రమానికి తెరలేపడం ఏమిటని ఆంధ్రులు ప్రశ్నిస్తున్నారు.. కొత్త అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు!

తాజాగా లోక్ సభలో అవిశ్వాసం అంశం చర్చకు రాకుండా చేయడంలో తెరాస కీలకపాత్ర పోషిస్తున్న విషయాన్ని అంతా షాకింగ్ విషయంగా భావిస్తున్నారు. తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ మోడీ దర్శకత్వ పర్యవేక్షణలో నడుస్తోందనే విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ పార్టీ లోక్ సభలో ఆందోళన చేసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.. కానీ.. కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ఎంపీలు ఒక వైపు తాము బీజేపీకి ప్రత్యామ్నాయం కోరుకుంటున్నామని చెబుతూనే బీజేపీని టార్గెట్ చేసే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవడంపై ఇటు సాదారణ ప్రజానికం అటు రాజకీయ నేతలు, విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.