Home రాజకీయాలు ఇండస్ట్రీ నుంచి టీడీపీకి దిమ్మతిరిగే కౌంటర్!

ఇండస్ట్రీ నుంచి టీడీపీకి దిమ్మతిరిగే కౌంటర్!

518
SHARE

టీడీపీ నేతలకు ఉన్నఫలంగా ప్రత్యేక హోదా, దానికి సంబందించిన పోరాటాలు గుర్తొచ్చేసిన సంగతి తెలిసిందే. నిన్నమొన్నటివరకు హోదా అనేది పలకకూడని పదంగా పరిగణించిన టీడీపీ నేతలు… తాజాగా హోదా హోదా హోదా అని తెగ ప్రసంగాలు చేసేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఎవరిని తిట్టినా కౌంటర్స్ పడిపోతున్నాయని భావించో ఏమో కానీ… సినీ జనాలపై పడి ఫైరయిపోయారు. అయితే… ఈ విమర్శలపై తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు.. కాదు కాదు.. టీడీపీకి దిమ్మతిరిగే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు!

గతంలో హోదా అంటే సంజీవని కాదు, ప్యాకేజీ చాలు అని కబుర్లు చెప్పిన టీడీపీ నేతలు.. గత పదిరోజులుగా ప్రత్యేక హోదా గురించి ఏదో హడావిడి చేస్తూ… దానికి సినిమా పరిశ్రమ కలిసి రావడం లేదని వ్యాఖ్యానించడం సరైంది కాదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.. కాస్త ఆలోచించి మాట్లాడితే మంచిది అని ఘాటుగా సూచించిన ఆయన.. అందరినీ కలుపుకోతే ఉద్యమం ముందుకుపోతుంది కానీ, ఇలా ఎదురైన ప్రతిఒక్కరినీ విమర్శించుకుంటూపోతే ఒరిగేది ఏమీ ఉండదని తేల్చిచెప్పారు.

జల్లికట్టుకు, ఏపీలో జరుగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి అసలు సంబందమే లేదని తేల్చిన తమ్మారెడ్డి… హోదా విషయంలో గతేడాది సినిమా జనాలు చేసిన పోరాటం మరిచి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు. గతేడాది విశాఖలో ప్రత్యేకహోదా పై పోరాడితే తనను, సంపూర్నేష్ బాబుని అరెస్టు చేసిన సంగతి టీడీపీకి గుర్తులేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఉద్యమం గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలే కదా.. నాలుగేళ్లుగా హోదా పోరాటాని చంపింది అని తమ్మారెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు.

సినిమా ఇండస్ట్రీకి సంబందించి మంచు మనోజ్, కొరటాల శివ మొదలైన వారు తమవంతుగా మాట్లాడుతూనే ఉన్నారని, స్పందిస్తున్నారని చెప్పుకొచ్చిన ఆయన… గతంలో తాను హోదా గురించి మాట్లాడితే.. సినిమాలు చేసుకోక ఆయనకు ఎందుకు అని తనను విమర్శించారని గుర్తుచేశారు తమారెడ్డి!! ఏది ఏమైనా… ఉన్నఫలంగా లేని ఊపుతెచ్చుకుని హడావిడి చేస్తున్న టీడీపీ నేతలు, సినిమా పరిశ్రమపై చేసిన కామెంట్స్ కి తమ్మారెడ్డి రూపంలో దిమ్మతిరిగే కౌంటర్ పడిందనే చెప్పాలి!