Home రాజకీయాలు విశ్లేషణ: పవన్ కు పంచడమే బాబు లక్ష్యం!

విశ్లేషణ: పవన్ కు పంచడమే బాబు లక్ష్యం!

SHARE

ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రావడం లేదు.? ఈ ప్రశ్నకు సమకాలీన రాజకీయ అంశాలపై కాస్త అవగాహన ఉన్న ఎవరైనా చెప్పే మాటలు.. చంద్రబాబు అవగాహనా రాహిత్యం.. దూరదృష్టి లేకపోవడం.. వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాలకోసం హోదా స్థానే ప్యాకేజీకి ఒప్పుకోవడం.. రాష్ట్ర ప్రయోజనాలకంటే సొంత సమస్యలపైనే దృష్టిపెట్టడం అని!! అయితే… తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ హోదా పోరాట బాధ్యతను భుజాలకెత్తుకుంది.. పార్లమెంటు సాక్షిగా జగన్ తన ఎంపీలతో అలుపెరగని పోరాటం చేయిస్తున్నారు. ఫలితంగా.. బాబుకు భయం వేసింది, ఇలానే తేలు కుట్టిన దొంగల్లా కూర్చుంటే ఏపీ ప్రజలు క్షమించరు అన్న భావనలో టీడీపీ పడింది. ఫలితంగా బాబు ఎత్తుకున్న పల్లవి మారింది!!

ప్రత్యేక హోదా సంజీవని కాదు.. ప్యాకేజీ చాలా బాగుంది, అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు.. హోదా పేరు చెబితే కేసులు.. ప్యాకేజీ వల్ల వచ్చే నిధులు రాష్ట్రానికి మేలు.. ఇవి హోదా పోరాటం వైకాపా తన భుజాలపైకి ఎత్తుకోకముందు బాబు మాటలు!! కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదు.. హోదా ఆంధ్రుల హక్కు.. హోదా బీజేపీ కావాలనే ఇవ్వడం లేదు.. ఇవి బాబు తాజా మాటలు!! బాబుకున్న రెండుకళ్ల సిద్ధాంతం వల్ల జరిగిన నష్టాలు, కష్టాలు నిత్యం కళ్లముందు కదులుతున్నా కూడా ఇంకా ఆ పాత పద్దతినే అవలంభించారు.. అవలంభిస్తున్నారు! ఆ సంగతులు అలా ఉంటే… ఈ విషయంలో పవన్ కు వాటా ఇవ్వాలని అనుకుంటున్నారు బాబు!!

బాబు హోదా విషయంలో ఎంత మాట్లాడినా.. కేంద్రంలో మంత్రులతో రాజీనామాల డ్రామాలు ఆడినా.. ఎన్డీఏతో తెగదెంపులు అన్నా.. జనాలు నమ్మలేని పరిస్థితి! హోదా విషయంలో బాబు బీజేపీని ఎంత తిట్టినా, విమర్శించినా కూడా ఏపీ వాసుల దృష్టిలో, చంద్రబాబుని నమ్మి ఓట్లేసిన జనాలకు మాత్రం హోదా రాని నేరం పూర్తిగా బాబుదే!! ఈ విషయంలో పూర్తి నేరం తనదైపోవడంతో భవిష్యత్తుపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్న చంద్రబాబు… ఈ నేరంలో కాస్త వాటా పవన్ కు పంచాలని తెగ తాపత్రయపడుతున్నట్లుగా కనిపిస్తున్నారు.

ఇందులో భాగంగా.. బీజేపీ ఇవ్వలేదు, ఇవ్వడం లేదు అని విమర్శించే ప్రతీ మాటకు ముందు ఒకసారి వెనక ఒకసారి పవన్ నామస్మరణ చేస్తున్నారు టీడీపీ నేతలు. తాజాగా ఏర్పాటుచేసిన టీడీఎల్పీ సమావేశంలో కూడా పూర్తిగా పవన్ ను మాత్రమే టార్గెట్ చేసి, హోదా ఇవ్వని బీజేపీతో కలిసి నడుస్తున్న పవన్.. అంటూ మాట్లాడుతున్నారు. అంటే… టీడీపీ లెక్కల ప్రకారం, బాబు ప్లాన్స్ ప్రకారం కేంద్రంతో పోరాడో, బామాలో తెచ్చుకోలేకపోయిన చేతకానితనానికి సంబందించిన వ్యవహారంగా ప్రస్తుతానికి మిగిలిపోయిన ఈ ప్రత్యేకహోదా విషయం.. ఇప్పటికీ రాకపోవడానికి టీడీపీది ఎంత నేరమో.. ఈ పరిస్థితుల్లో బీజేపీతో అంటకాగుతున్న పవన్ ది కూడా అంతే నేరం అనే ప్లాన్ వేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే హోదా రాని నేరం బాబుతో పాటు కాస్త పవన్ కు పంచాలనేది వారి తాజా ప్లాన్ గా ఉంది!

ఈ విషయంలో పవన్.. బాబు రాజకీయ ఎత్తుగడలను పసిగట్టి జాగ్రత్తపడుతూ ముందుకుపోగలుగుతారా… లేక బాబు ఎన్ని అనుకున్నా, టీడీపీ ఎలా ఇరికిస్తున్న పర్లేదు.. మోడీ, కేంద్ర ప్రభుత్వ విషయంలో తన వైఖరిని ఇలానే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి!! ఈ విషయంలో పవన్ వేయబోయే అడుగులు.. కచ్చితంగా జనసేన భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదనే చెప్పాలి!!