ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లగా అవినీతి తారా స్థాయిలో చేరిందన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఏపీ అవినీతిలో నెంబర్ వన్‌గా ఉందని ధృవీకరించాయి. చివరకు పవన్ కల్యాణ్ కూడా ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కుండబద్దలు కొట్టేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. త్వరలోనే ఏపీలో సీబీఐ రంగ ప్రవేశం చేయబోతోందని ఒక మీడియాలో వచ్చిన వార్త సంచలనంగా ఉంది. ఢిల్లీలో పరిచయాలున్న సీరియర్ జర్నలిస్ట్‌లు కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరిస్తున్నారు. అయితే సీబీఐ నేరుగా రాజకీయ నాయకులపై కాకుండా.. హద్దులు దాటి అవినీతికి సాయం చేసిన ఐదుగురు అధికారులపై సీబీఐ గురి పెట్టినట్టు కథనం.
ఇప్పటికే ఐదుగురు సీరియర్ ఐఏఎస్‌లకు సంబంధించిన పక్కా సమాచారాన్ని సీబీఐ సేకరించినట్టు చెబుతున్నారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం సీబీఐ కేసు నమోదు చేసి రంగ ప్రవేశం చేయనుందని వార్త కథనం. ఈ ఐదుగురు అధికారుల్లో ముగ్గురు ముఖ్యమైన అధికార కేంద్రంలో ఉన్నట్టు చెబుతున్నారు. మరో ఇద్దరు అత్యంత ముఖ్యమైన శాఖ అధికారులు. ఈ అధికారులు తాము ఐఏఎస్లమన్న సంగతి కూడా మరిచి నేతల అవినీతికి హద్దులు మీరి సహకరించినట్టు సీబీఐ ఇప్పటికే గుర్తించినట్టు చెబుతున్నారు.
నేరుగా రాజకీయనాయకులపై కేసులు పెడితే వాటి సాయంతో సానుభూతి పొందడం, కక్ష సాధింపు అంటూ బుకాయించడం చేస్తారన్న ఉద్దేశంలో సీబీఐ తొలుత అవినీతికి సాయం అందించిన అధికారులపై గురి పెట్టినట్టు చెబుతున్నారు. నాలుగేళ్లలో తెచ్చిన లక్షా 20వేల కోట్ల అప్పు సొమ్ము ఏమైంది?.. కేంద్రం ఇచ్చిన నిధులు లెక్కలు చెప్పలేని విధంగా ఎక్కడికి వెళ్లిపోయాయి వంటివన్నీ ఇప్పుడు బయటకు రప్పించాలన్నది సీబీఐ ఉద్దేశంగా చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఏపీలో మరో కుదుకు ఖాయం.