Home రాజకీయాలు రాజేంద్రప్రసాద్‌ మాటలు బాలయ్యకు తగిలాయా..?

రాజేంద్రప్రసాద్‌ మాటలు బాలయ్యకు తగిలాయా..?

SHARE

తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలియదు కానీ… ఉన్నఫలంగా సినిమా పరిశ్రమపై పడ్డారు టీడీపీ నేతలు! చిత్ర పరిశ్రమకు టీడీపీ ప్రభుత్వం ఏమి చేసింది అనే విషయాలు ప్రస్తుతం అప్రస్తుతం అయినప్పటికీ… ఆ విషయాలను కూడా ప్రస్థావిస్తూ పరిశ్రమపై తనదైన శైలిలో ఫైరయ్యారు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్. “ఏపీ ప్రత్యేక హోదా కోసం అన్నీ వర్గాల వారు మద్దతు ఇస్తుంటే సినీ పరిశ్రమ ఎందుకు ముందుకు రావడం లేదు.. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాన్ని అక్కడి పరిశ్రమ ముందుండి నడిపించింది.. తెలుగు చిత్రపరిశ్రమకు చేవ చచ్చిపోయిందా? సినీ ప్రముఖులకు ఏమైంది? అంటూ ఫైరయ్యారు. అయితే ఈ ఫైర్ అనంతరం సోషల్ మీడియా వేదికగా బాబూ రాజేంద్రప్రాద్ పై ప్రశ్నల వర్షాలు కురుస్తున్నాయి!

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన విధానం తప్పైనా… విషయం మాత్రం కాస్త కరెక్టే అనుకోవచ్చు అనేది పలువురి అభిప్రాయంగా ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమవంతుగా పోరాడాల్సిన బాధ్యత కచ్చితంగా సినీపరిశ్రమపై కూడా ఉంది! అయితే.. ఇందుకు రాజేంద్రప్రసాద్ ఎత్తుకున్న అంశం జల్లికట్టు! అయితే తమిళనాడు ప్రభుత్వానికి తమిళ సినీపరిశ్రమ కు మధ్య ఉన్నంత బంధం టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వానికీ ఉందా అనేది మరికొందరి ప్రశ్నగా ఉంది!! ఆ సంగతులు అలా ఉంటే… ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ లో ఒక ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ కూడా సినిమా నటుడే, టాప్ హీరోల్లో ఒకరే! ఈ విషయాన్ని ప్రసాద్ మరిచారా లేక సినిమా ఇండస్ట్రీ లో ఎవరూ బాలయ్య మాటలు వినరులే అనుకున్నారా? అనేవి కొత్త ప్రశ్నలు!

నిజంగా సినిమా పరిశ్రమ పోరాడటం.. కచ్చితంగా హోదా పోరాటానికి ప్లస్ అవుతుందని టీడీపీ నేతలు భావిస్తే… బాలకృష్ణ ను ఆ విషయంలో కాస్త ఒక అడుగు ముందుకేసి, సినిమా జనాలనందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాల్సింది అనేది పలువురి సూచనగా ఉంది. బాలయ్య సినిమా పరిశ్రమలో ఉన్న పెద్ద ఫ్యామిలీల్లో ఒకరు! ఎవరు అవునన్నా కాదన్నా బాలయ్య ఈ మేరకు ఒక పిలుపునిస్తే.. కచ్చితంగా ఇండస్ట్రీ కదిలివచ్చేది అనడంలో సందేహంలేదు. వచ్చినవారిలో బాలయ్యపై అభిమానంతోనో గౌరవంతోనో కొందరు వచ్చినా… మిగిలిన వారు రాష్ట్ర ప్రజలకు, అభిమానులకు కాస్త జంకైనా రంగంలోకి దిగేవారు! మరి ఈ విషయాలను బాలయ్య ఎందుకు మరిచినట్లు… బాలయ్య బిజీలో మరిచిపోయారు అనుకున్నా… టీడీపీ నేతలు ఎందుకు బాలయ్యకు ఈ సలహా ఇవ్వలేదు అనేది మరో ప్రశ్న!!

అయితే… ఈ విషయాలను మరిచిన బాబూ రాజేంద్రప్రసాద్.. ప్రత్యేక హోదా గురించి తాము మాత్రమే పోరాడుతున్నాం అనే కలరింగ్ ఇచ్చే క్రమంలో.. తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీపై ఫైరయ్యారు. ఇంతకాలం హోదా గురించి పోరాడితే కేసులు పెడతామని చెప్పుకొచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు పోరాడటం లేదని ఫైరవడంపై కూడా సోషల్ మీడియాలో వ్యగ్యాస్త్రాలు వదులుతున్నారు నెటిజన్లు!! అయితే.. ఈ విషయాలపై బాలయ్య ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి!!