Home రాజకీయాలు చంద్రబాబుపై పవన్.. మాములుగా లేదుగా!

చంద్రబాబుపై పవన్.. మాములుగా లేదుగా!

179
SHARE

ఏమైందో తెలియదు.. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు.. అసలు కారణం ఏమిటో పూర్తిగా వెలుగులోకి రాలేదు.. కానీ… 2014 సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి నిన్న మొన్నటివరకూ చాలా అన్యోన్యంగా కలిసున్న పవన్ – చంద్రబాబు మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో జ్ఞానోదయం అయ్యిందో లేక వాస్తవాలు తెలుసుకోవడానికి కాస్త ఆలస్యం అయ్యిందో తెలియదు కానీ.. చంద్రబాబు ప్రభుత్వం పై పవన్ ఫైరవుతున్నారు. వేదిక ఏదైనా, జాతీయ మీడియా, స్థానిక మీడియా అని తారతమ్యాలు లేకుండా.. బాబుపై నిప్పులు చెరుగుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్… చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని మొదలుపెట్టిన పవన్… ప్రజల భావోద్వేగాలతో టీడీపీ ఆడుకుందని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. పరిస్థితులు చేజారిపోయాయని.. ప్రస్తుతం టీడీపీకి ఆప్షన్స్ లేవని అభిప్రాయపడ్డారు పవన్.

ఈ విషయాలపై స్పందించిన టీడీపీ నేతలు మాత్రం… పవన్ పరిపక్వత లేని రాజకీయ నాయకుడు అని చెప్పుకొస్తున్నారు. 2014 ఎన్నికల నాటి నుంచి రెండు రోజుల క్రితం వరకూ పవన్ పరిపక్వతపై టీడీపీ నేతలకు క్లారిటీ లేదా అనే ఎదురుప్రశ్నలకు మాత్రం.. మాకు తాజాగానే తెలిసిందని చెప్పుకొస్తున్నారు టీడీపీ నేతలు! ఇదే విషయంపై… చంద్రబాబుకు సన్నాయినొక్కులు నొక్కితే పవన్ మంచోడు, ప్రశ్నిస్తే మాత్రం చెడ్డోడు అయిపోయాడా అనే ప్రశ్నలు టీడీపీకి ఎదురవుతుండటం గమనార్హం!