Home రాజకీయాలు సీఎం రమేష్ రాష్ట్రానికి అంతచేశారంట?

సీఎం రమేష్ రాష్ట్రానికి అంతచేశారంట?

SHARE

నవ్విపోదురుగాక నాకెటి సిగ్గు అన్నట్లు ఉంటుంది కొంతమంది వ్యక్తుల ప్రవర్తన, మరికొన్ని మీడియా సంస్థల, పత్రికల వ్యవహారశైలి! ఈ విషయంలో తాజాగా ఒక పత్రిక సీఎం రమేష్ కు ఎందుకు రెండోసారి రాజ్యసభ సీటు వచ్చింది అనే విషయంపై ఎవ్వరూ ఊహించని, మరెవ్వరూ ఇంతకాలం గ్రహించని విషయాలు వెల్లడించింది. సీఎం రమేష్ కు రెండోసారి కూడా రాజ్యసభ సీటు రావడానికి గల కారణాలు, అందుకు కారణమైన పరిస్థితులు, సంబధాలు గురించి రకరకాల ఊహాగాణాలు వస్తున్న నేపథ్యంలో.. సీఎం రమేష్ పనితీరే దీనికి ప్రధాన కారణమని తేల్చి చెప్పింది ఆ పత్రిక!!

ఇంకా వివరంగా మాట్లాడుకుంటే… ముఖ్యంగా రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు సాధించడంలో సీఎం రమేష్ చాలా కీలకంగా వ్యవహరించేవారట. అవును… మరి ఇప్పుడు బీజేపీ నిధులు ఇవ్వడం లేదని చెబుతున్న మాటలు, సీఎం రమేష్ పనితీరుకు అవమానమే కదా!! కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలనుంచి నిధులు, విధులు రాబట్టడంలో రమేష్ దూకుడు, చాకచక్యం చంద్రబాబుకు ఎంతో నచ్చేవట. ఇదే నిజమైతే… గత నాలుగు సంవత్సరాలుగా కేంద్రంనుంచి రావాల్సిన నిధుల విషయంలో బాబు చెప్తున్నట్లు ఏమీ రావడంలేకపోతే.. సీఎం రమేష్ ఏం చేస్తున్నట్లు!! ఆ సంగతి అలా ఉంటే.. మరో అద్భుతమైన విషయం ఏమిటంటే… ప్రత్యేక హోదా విషయంలో సీఎం రమేష్ పోరాటం కూడా మరోమారు రాజ్యసభ సీటు ఇవ్వడానికి కారణం అయ్యిందంట.

నిజంగా ఇది ఆ పత్రిక (నిస్సిగ్గుగా) పేర్కొన్న విషయమే! అవును… ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాల సాధన కోసం నిరంతరం రాజ్యసభలో పోరాటాలు సాగించారట సీఎం రమేష్. ఆయన పోరాటం హోదా గురించా, ప్యాకేజీ గురించా అనే విషయాలపై స్పష్టత ఇవ్వని ఆ పత్రిక, రెండింటి గురించీ తెగ పోరాడారని చెబుతుంది. అంతేనా.. మరో అడుగు ముందుకేసిన ఆ పత్రిక… 2013 రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో పూర్తి స్థాయిలో గళం విప్పి విభజన అస్సలు వద్దని కూడా సీఎం రమేష్‌ పోరాటం చేశారని రాసుకోచ్చింది. ఆ రకంగా రిపోర్ట్ చేసి..ఈ రకంగా డిసైడ్ చేసింది!! ఏది ఏమైనా… ఆ పత్రిక కలానికి ఉన్నది ఒక్క పాళి కాదు సుమా!!