Home రాజకీయాలు ఏమి సాధించారని ఈ హడావిడి జేసీ!

ఏమి సాధించారని ఈ హడావిడి జేసీ!

425
SHARE

టీడీపీ నాయకుల ప్రత్యేక హోదా పోరాటం, దానిలో నిజాయితీల సంగతి కాసేపు పక్కన పెడితే… ఈ హడావిడి పుణ్యమా అని రకరకాల విన్యాశాలు మాత్రం చూపిస్తున్నారు టీడీపీ ఎంపీలు. నిన్నమొన్నటి వరకూ గెటప్పులపై గెటప్పులు వేసి అసలు విషయం కంటే కొసరు విషయంపైనా, పబ్లిసిటీపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించే ఎంపీ ఒకరైతే తాజాగా తన “అతి” తో విమర్శల పాలవుతున్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏమి సాధించామని ఫీలయ్యారో, ఏదో ఉద్దరించేశామని భావించారో తెలియదు కానీ.. ఉన్నట్లుండి సినిమాలోని బాలయ్య బాబు పూనినంత పనిచేశారు!

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి పోరాడాల్సిన విషయం మరిచిన అధికారపక్ష నేతలు.. ఢిల్లీలో సిన్సియర్ గా పోరాటం చేస్తున్న వైకాపా ఎంపీలపై కాలుదువ్వుతున్నారు. వివరాళ్లోకి వెళ్తే… పార్లమెంటు ముఖద్వారం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్లకార్డులు పట్టుకొని నిల్చుని, హోదా సాధన కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఆ సమయంలో వీరి వద్దకు వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి.. తొడ కొట్టి, మీసం మెలివేసారు. అప్పటివరకూ మామూలుగానే కనిపించిన జేసీ ఊగిపోవటం.. తీవ్ర ఆవేశానికి గురవడం వంటి తీరు వివాదాస్పదంగా మారింది. టీడీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలు అని వైవీ వ్యాఖ్యానించిన దానికి కౌంటర్ గా… నిన్న నువ్వు మాట్లాడిందేమిటయ్యా.. నీకు దమ్ముంటే రాజీనామా చేయ్.. మేం రాజీనామా చేస్తాం.. మళ్లీ పోటీ చేద్దాం.. ఎవరు గెలుస్తారో చూద్దామంటూ వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఉద్దేశించి జేసీ మీసం మెలి వేసి తొడ కొట్టారు.

ఆ సంగతి అలా ఉంటే… అసలు తొడకొట్టి, మీసం మెలేసేటంత గొప్పపని ఏమి చేశారో టీడీపీ ఎంపీలకే తెలియాలనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వ్యక్తిగత అభిప్రాయాలు పక్కనపెట్టి ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. పార్లమెంటు సిబ్బంది అలెర్ట్ అయ్యి మరీ పరిస్థితిని సద్దుమణిగించాల్సిన పరిస్థితి నెలకొందంటే.. జేసీ ఏ రేంజ్ లో చెలరేగిపోయారనేది స్పష్టం అవుతుంది.

అసలు ఇంతకాలం సన్నాయినొక్కులు నొక్కి కేంద్రం వద్ద అసమర్ధులుగా ప్రవర్తించిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏమి సాధించేశారని ఇంతలా చెలరేగిపోతున్నారనేది వారికే తెలియాలి. ఈ ఆవేశం ఆయాసం తాలూకది కాదు నిజంగా పౌరుషం అయితే… ఇంత ఆవేశం ఉన్న వారు ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రం కదిలే రేంజ్లో రియాక్ట్ అయ్యి, కేంద్రం మెడలు వంచేలా కృషి చేయాలి తప్ప… అదే అంశంపై తమదైన శైలిలో పోరాడుతున్న స్వరాష్ట్ర నాయకులపై ఇలాంటి చిల్లర పనులు ఎందుకని పలువువు ప్రశ్నిస్తున్నారు!