Home రాజకీయాలు జగన్ ఫిక్స్… ఏమంటారు బాబు?

జగన్ ఫిక్స్… ఏమంటారు బాబు?

1179
SHARE

రాజకీయాల్లో క్రెడిట్ గేం ప్రతీ చిన్న విషయంలోనూ ఉంటుంది. ఏ చిన్న కార్యక్రమం చేసిన అక్కడ పార్టీ జెండా ఎగరేయడమే కాకుండా… ప్రత్యర్ధి పక్షం మంచి చేసినా సహకరించకపోవడం నిత్యం జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి కలిసి పోరాడాలి అనేటంత హుందాగా నడుచుకునే నాయకులు ఈ రోజుల్లో కనిపించడం చాలా అరుదు. అయితే ఈ విషయంలో జగన్ అభినందనీయమైన పంథాతో ముందుకు వెళ్తున్నారు. ఏమాటకామాట చెప్పుకోవాలంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎంతో సీనియారిటీ ఉన్న రాజకీయ నాయకులకంటే కూడా అతి పరిపక్వతతో, హుందాగా, సూటిగా నడుచుకుంటున్నారు వైకాపా అధినేత జగన్. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలనే విధంగా ముందుకు పోతున్న వైఎస్ జగన్.. తాజాగా ప్రకటించిన నిర్ణయం అభినందనీయమనే అంటున్నారు విశ్లేషకులు.

విషయానికొస్తే… కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 21వ తేదీన అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించిన వైకాపా అధినేత జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ అవిశ్వాస తీర్మానానికి కలిసి రావాలని సూచించారు. ఇదేమి పెద్ద విషయం… ఇలానే పిలుస్తారు కదా అని లైట్ తీసుకోవద్దు సుమా! ప్రతిపక్షం పిలిస్తే తాము రావడం ఏమిటి.. యువకుడు పిలిస్తే సీనియర్ ని నేను రావడం ఏమిటి అని చంద్రబాబు ఫీలవుతారని అనుకున్నారో ఏమో తెలియదు కానీ… బాబుకు మరో ఆప్షన్ కూడా ఇచ్చారు జగన్. అలా కానిపక్షంలో చంద్రబాబే అవిశ్వాసం పెట్టడానికి సిద్ధపడితే.. మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధమని సూటిగా ప్రకటించారు వైఎస్ జగన్.

ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటివరకూ ఆడిన డ్రామాలు చాలు అన్నట్లు చెప్పిన జగన్ ఇంకా ఇవే డ్రామాలాడితే చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని, అలా కాకుండా హోదా సాధనకు మాతో కలిసి చిత్తశుద్ధితో పోరాటం చేయాలని వైఎస్ జగన్ సూచించారు. రేపే అవిశ్వాసం అని టీడీపీ ప్రకటించినా కూడా తాము మద్దతిస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజున మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా జగన్ పిలుపునిచ్చారు.

ఈ లెక్కన చూసుకుంటే… ప్రత్యేక హోదా అంశంపై పోరాటం విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు కదులుతున్నట్లున్నారు జగన్. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం డ్రామాలాడటం కాకుండా.. చిత్తశుద్ధితో ముందుకు పోతున్నారనే అనుకోవాలి. ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గేది లేదని ఫిక్సయినట్లు కనిపిస్తుంది. ఇక ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం బాబు చేతుల్లో ఉంది. ఈ విషయంలో జగన్ కు టీడీపీ సపోర్ట్ చేస్తే నేడు చేసిన రాజీనామాల్లో కొద్దో గొప్పో చిత్తశుద్ధి ఉందని భావించవచ్చు, అలా కాని పక్షంలో మరోమారు రాజకీయ రంగస్థలంపై బాబు అండ్ కో ఏపీ ప్రజలకు మరో డ్రామా చూపింఛినట్లే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.