Home రాజకీయాలు విశ్లేషణ: చేతకాని అనుభవం ఓడిందా?

విశ్లేషణ: చేతకాని అనుభవం ఓడిందా?

SHARE

సుదీర్ఘ రాజకీయ అనుభవం, అపర చాణిక్యం ఇలా చెప్పుకుంటూపోతే చాలానే చెప్పుకునే నారా చంద్రబాబు పప్పులో కాలేశారట! నాడు బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన చంద్రబాబు తాజాగా… “మోసపోయాం.. అన్యామైపోయాం” అని చెప్పుకొస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు అయిన చంద్రబాబు, ఏ సీనియారిటీని చూపించి 2014 ఎన్నికల్లో ప్రజల మద్దతు సంపాదించారో.. ఆ అనుభవం తలవంచుకునేలా, ఆ అనుభవం అభాసుపాలయ్యిందని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తన రాజకీయ అనుభవం మోడీ రాజకీయం ముందు అత్యంత దారుణంగా ఓడిపోయిందని పరోక్షంగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు అని చెప్పుకునే బాబు.. కేంద్రంలో బీజేపీ పెద్దలను హోదా విషయంలో ఒప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అయితే ఈ విషయాన్ని తనదైన శైలిలో జాగ్రత్తగా తెలివిగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.

తాను అవతలివారు అంత బాగా ఆడరని నమ్మాను కానీ.. తెలివిగా ఆడి గెలిచారు అంతే.. అన్న చందంగా మాట్లాడుతున్న చంద్రబాబుపై… తన స్వార్ధ ప్రయోజనాలకోసం నాలుగేళ్ల పాటు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇంతకాలం కేంద్రంతో పబ్బం గడిపారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపోరాటం అత్యంత తీవ్రమవుతున్న తరుణంలో.. తాను “బీజేపీ”పై పెట్టుకున్న నమ్మకాన్ని “కేంద్రం” వమ్ము చేసిందని అత్యంత తెలివిగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. ఈ సమయంలోకూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నామే తప్ప ఎండీయే తో ప్రస్తుతానికి కాదని చెబుతుండటం బాబు రాజకీయ క్రీడలో రాజీనామాల డ్రామాలు ఎందుకో చెప్పకనే చెప్పేశారు!

ఏపీ అసెంబ్లీలో బాబు చెప్పుకొస్తున్న మాటలు, చేస్తున్న సుదీర్ఘ ప్రసంగాలను సరిగ్గా గమనిస్తే… అనుభవం ఓడిపోయిందనేది ఎక్కువగా అర్ధమవుతున్న మాట! ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ అన్నప్పుడు సంబరాలు చేసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం హోదా గురించి టీడీపీ చాలానే చేసిందని చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడేలా రాజీనామాల డ్రామాకు తెరలేపారు. అనుభవంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఇలాంటి డ్రామాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారో ఏమో కానీ.. అనుభవం పేరు చెప్పి ఏపీ ప్రజలకు అన్యాయం చేసింది మాత్రం చంద్రబాబే! ఇస్తానని చెప్పడం కేంద్రం మాట.. వాటిని సాధించి తెచ్చుకోలేకపోవడం రాష్ట్రం ఓటమి అనే విషయాన్ని కప్పిపుచ్చుతున్న చంద్రబాబు… బీజేపీ అన్యాయం చేసిందనే చెప్పుకొస్తున్నారు.

ఇలా అత్యంత తెలివిగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్న బాబుని “బీజేపీ గురించి మాకెందుకయ్యా… 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలకు మాట ఇచ్చి, అనుభవాన్ని చూపించి కుర్చీ ఎక్కింది మీరు.. అలాంటప్పుడు ఆదినుంచీ పోరాడటం, ప్రశ్నించడం మానేసి.. అన్నీ ఐపోయాకా సన్నాయినొక్కుల రాజీనామాలు ఎవరికోసం, ఎవరి సానుభూతికోసం.. బీజేపీపై బురదజల్లి, బీజేపీని సాకుగా చూపించి తప్పించుకుంటే.. ఇంతకాలం ఏపీకి జరిగిన అన్యాయం పరిస్థితి ఏమిటి… మీ అనుభవం రాష్ట్రానికి మేలు చేస్తుందని.. అక్కడ మోడీ – ఇక్కడ బాబు అని చెప్పుకున్న మాటలు ఇప్పుడేవి” అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సింది మరో విషయం ఉంది… బీజేపీ – టీడీపీ స్నేహబందం వారి వ్యక్తిగతమైన విషయం! ఇక్కడ ఏపీ వాసులకు కావాల్సిందేమిటంటే.. పక్కన మోడీని పెట్టుకునో, అమిత్ షా ని పెట్టుకునో 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు మాట ఇచ్చింది చంద్రబాబు… అలాంటప్పుడు తన చేతకాని తనాన్ని జనాలు గమనించకుండా.. నేరం మొత్తం బీజేపీపై వేసి తప్పించుకుంటున్నారు. ఇక్కడ ఏపీ ప్రజలకు కావాల్సింది కేంద్రం అన్యాయం చేసిందా లేదా అనేదాని కంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం చేసిన న్యాయం ఏమిటి అనేది!

ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఢిల్లీ 29 సార్లు వెళ్లినా కూడా పని కాలేదంటే… బాబుకి చేతకావడం లేదనుకోవాలా, చేవలేదనుకోవాలా? నేడు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుందంటే ఆ విషయంలో కనిపిస్తుంది కేంద్రం మోసమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వ పరిపూర్ణమైన నిర్లక్ష్య ధోరణి, చేతకాని తనం, స్వార్ధ రాజకీయ వ్యక్తిగత ప్రయోజన ఫలితం కూడా! సుపరిపాలన అందించడానికి కావాల్సింది అనుభవం కాదు.. ప్రజలకు మేలు చేయాలన్న తపన.. అది కొరవడిన విషయం రుజువైన తరుణం ఇది!!