Home రాజకీయాలు జగన్ ఆ స్టాండ్ తీసుకోకపోయి ఉంటే…!

జగన్ ఆ స్టాండ్ తీసుకోకపోయి ఉంటే…!

SHARE

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో అది ఒక హాట్ టాపిక్.. ఆ అంశమే ట్రంప్ కార్డ్.. ఆ ప్రధాన అంశం చుట్టూనే ఏపీలో ఎన్నికలు జరిగాయని అన్నా అతిశయోక్తి కాదు.. అదే నవ్యాంధ్రకు “ప్రత్యేక హోదా”! ఇదే విషయంపై ఐదేళ్లు అని ఒకరంటే, కాదు కాదు పదేళ్లు అని మరొకరు.. చ చా అలా కాదు 15 అని ఇంకొకరు! ఏపీ ప్రజలతో గాల్లో మేడలు కట్టించారు.. ఎన్నికల్లో తమ పబ్బం గడుపుకున్నారు! తర్వాత కొంత కాలానికి.. అది పాత విషయం, గడిచిన అధ్యాయం అయిపోయింది. ప్రజలకు ఆ అంశంపై ఎన్నో ఆశలున్నా.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆ అంశాన్ని “ముగిసిన అధ్యాయం”గా ప్రస్థావించారు.

ఇదే సమయంలో కేంద్రం నుంచి చావు కబురు చల్లగా చెప్పే ప్రయత్నంలో.. “హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ” అని తెలిసింది. ఆ కబురు విన్న ఏపీ వాసులు అంతా రగిలిపోతుంటే… ఏం పర్లేదు.. ఏం పర్లేదు.. అంటూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు తినిపించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు! దీంతో హోదా విషయం ఇంక పూర్తిగా మరుగున పడినట్లేనని ప్రజలంతా ఆందోళన చెందుతున్న సమయం. ఆ సమయంలో జగన్ రూపంలో ప్రత్యేక హోదాకు ఒక ఊపు వచ్చిందనే చెప్పాలి.

హోదా ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో వినిపించేలా తన ఎంపీలను సిద్ధం చేసిన అనంతరమే మరోసారి ప్రత్యేక హోదాకు బలమైన ఊపు వచ్చిందనేది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవమనే చెప్పాలి. హోదా అనేది సంజీవని కాదు, అది ముగిసిన అధ్యాయం అన్న నోళ్లే.. నేడు రాజీనామాలు చేసేటంత చిత్త శుద్ధి మాకు ఉందని చెబుతున్నాయంటే.. దానికి కారణం కచ్చితంగా వైకాపా తీసుకున్న గట్టి నిర్ణయమే, పోరాట పటిమే కారణం అనక తప్పదు. ఈ క్రమంలో నేడు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన ఏపీకి ప్రత్యేక హోదా అంశం కచ్చితంగా బలమైన అంశంగా ఢిల్లీ వీదుల్లో వినిపిస్తుంది!

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… జగన్ ఆరోజు ఈ బాధ్యత అధికారపక్షానిదనో, కేంద్రానిదనో లైట్ తీసుకుని ఉంటే ఈ రోజు పసుపు కండువా జనాలంతా సైలంట్ గా కాలం గడిపేయడమే కాకుండా.. రాబోయే ఎన్నికల్లో కూడా పొత్తు మార్చుకుని అదే అంశంపై ఎన్నికల్లోకి వెళ్లేవారనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా.. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై నేడు ఢిల్లీలో జరుగుతున్న పోరాటం కచ్చితంగా మంచి ప్రతిఫలాన్ని రాష్ట్రానికి ఇవ్వాలని కోరుకుంటూ, ఆ క్రెడిట్ కచ్చితంగా ప్రజలు జగన్ కు ఇస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!..