Home రాజకీయాలు ఈ మాట జగన్ కీ వర్తిస్తుంది కదా తమ్ముళ్లు!

ఈ మాట జగన్ కీ వర్తిస్తుంది కదా తమ్ముళ్లు!

SHARE

ఏదైనా తమదాకా వస్తే కాని తెలియదని ఒక సామెత. ప్రస్తుతం టీడీపీ నేతలు చెబుతున్న మాటలు, పడుతున్న భయాలు చూస్తుంటే ఆ సామెతే గుర్తుకు వస్తుంది. విషయానికొస్తే… నానాటికీ బలహీనపడుతున్న బీజేపీ – టీడీపీ అవసరార్ధ స్నేహ మైత్రి తెగిపోవడానికి దగ్గరగా ఉందని సంకేతాలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మేమే వద్దనుకున్నామని, కలిసి ఉంటారో ఉండరో బీజేపీ నేతల ఇష్టం అని, ఆ నిర్ణయం వారికే వదిలేశామని బరువైన మాటలు మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు! ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఇదే విషయాన్ని తమ సానుభూతి పత్రికలు, టీవీ చానల్లో జనాలకు ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంగతులు అలా ఉంటే.. ఈ సందర్భంగా బాబు అండ్ కో మాట్లాడిన మాటలు మాత్రం.. జగన్ అండ్ కో ల నాటి వాదనకు బలం చేకూరుస్తున్నాయనే అనుకోవాలి.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు బీజేపీ నేతల దగ్గర సన్నాయి నొక్కులు నొక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్‌ లో ఏర్పాటుచేసుకున్న టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి! ప్రత్యేక హోదా నేరం తమ చేతకాని తనం, తమ అవగాహనా రాహిత్యం, తమ స్వలాభ ఆలోచనా విధానం, తమ దూరదృష్టిలోపం అని బయటపడనీయకుండా.. నేరం మొత్తం బీజేపీపై వేసి స్నేహగీతానికి చరమగీతం పాడాలని టీడీపీ మెజార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారంట. ఈ సందర్భంగా.. ఈ సమయంలో కలహానికెల్లినట్లు కేంద్రం భావిస్తే… కేసులు పెడతారేమో అని సందేహం పలువురు నేతలు బాబు వద్ద వ్యక్తపరిచారట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అంతిమ నిర్ణయం మీకే వదిలేశామని బాబుని ఉద్దేశించి నేతలు అన్నారట.

ఈ సందర్భంగా ఆలోచిస్తే… తమకు అనుకూలంగా లేకపోయినా, రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎదురుతిరిగినా.. కేంద్రం కేసులు పెట్టి మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నాలు చేస్తుందని టీడీపీ నేతల భయం వ్యక్తపరచడం!! కొన్ని సందర్భాల్లో ఇదే వాస్తవం అనుకుంటే… నాడు జగన్ విషయంలో నమోదైన కేసుల విషయంలో వైకాపా నేతలు, ప్రజలూ చెప్పింది ఇదే కదా!! ఈ విషయంపై ఎందరో మేధావులు విశ్లేషించినా.. కేంద్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పినా లెక్కచేయని టీడీపీ నేతలు.. ఇప్పుడు మాత్రం మోడీ విషయంలో ఇలా కొత్త భయాలు వ్యక్తపరుస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ లెక్కన చూసుకుంటే… కేంద్రం తలచుకుంటే రాష్ట్ర నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేదించగలుగుతుంది అనే మాట స్వయంగా టీడీపీ నేతలు ఒప్పుకోవడమే కాకుండా… నోటుకు ఓటు కేసు భయం కూడా టీడీపీ నేతలు పుష్కలంగా ఉందని అర్ధం అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.