Home రాజకీయాలు భూతకాలంలో విచారణకు రావాల్సిందిగా కోటంరెడ్డికి నోటీసులు

భూతకాలంలో విచారణకు రావాల్సిందిగా కోటంరెడ్డికి నోటీసులు

1001
SHARE

ఇప్పటికే ఏపీలో పోలీసు వ్యవస్థ టీడీపీ నాయకులు చేతిలో బంధి అయిందన్న విమర్శలు వస్తున్న వేళ నెల్లూరు పోలీసు అధికారుల తీరు మరోసారి చర్చకు దారి తీసింది.

క్రికెట్ బెట్టింగ్ కేసులో ఎనిమిది నెలల క్రితం ఒకసారి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించిన పోలీసులు హఠాత్తుగా మరోసారి నోటీసులు జారీ చేశారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో నాడు కోటంరెడ్డికి, అనిల్ కుమార్ యాదవ్‌కు నోటీసులు ఇచ్చారు.

నంద్యాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ అంశాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల వేళ మరోసారి ఎమ్మెల్యేలను బెదరగొట్టేందుకే ఈ నోటీసులు ఇచ్చారని కోటంరెడ్డి విమర్శించారు. వైసీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న కార్యక్రమానికి బయలుదేరుతున్న సమయంలో ఉదయం హఠాత్తుగా పోలీసులు నోటీసులతో వచ్చారని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వివరించారు.

ఉదయం ఏడు గంటల 45 నిమిషాలకు పోలీసులు తన ఇంటి వద్దకు వచ్చారన్నారు. నోటీసుల్లో చూస్తే ఉదయం ఏడున్నరకే విచారణకు రావాల్సిందిగా ఉందన్నారు. విచారణకు నోటీసులు కనీసం మూడు రోజుల ముందు ఇస్తారని.. కానీ నెల్లూరు పోలీసులు మాత్రం ఉదయం ఏడు గంటల 45నిమిషాలకు వచ్చి.. ఏడున్నరకే విచారణకు హాజరుకావాలని ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు.

గడిచిపోయిన కాలంలో విచారణకు రావడం సాధ్యమా అని ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికల సమయంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని విచారిస్తారా అని జిల్లా ఎస్పీని ఆయన ప్రశ్నించారు. ఇదే ఎస్పీ రామకృష్ణ ఆగస్టులో మూడుసార్లు మీడియా ముందు ఏ ఎమ్మెల్యేకు కూడా క్రికెట్ బెట్టింగ్‌లో ప్రమేయం లేదని చెప్పారని.. కానీ నాడు నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీకి చెడ్డపేరు తేవడం కోసం తిరిగి తనకు నోటీసులు ఇచ్చారన్నారు.

ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల వేళ కోటంరెడ్డికి నోటీసులు ఇచ్చి బెదరగొడితే మిగిలిన ఎమ్మెల్యేలు అధికార పార్టీకి లొంగుతారన్న ఉద్దేశంతోనే ఈ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల ఎస్పీ రామకృష్ణను బదిలీ చేయాల్సిందిగా జిల్లా టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల మనసు గెలిచేందుకు పోలీసు అధికారులు ఇలాంటి నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు.

విచారణకు హాజరైన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లతో సంబంధాలు ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు శ్రీధర్‌ రెడ్డి. ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు.