Home రాజకీయాలు కేంద్రం నుంచి బయటకు.. అదే సమయంలో బాబు కొత్త ట్విస్ట్‌

కేంద్రం నుంచి బయటకు.. అదే సమయంలో బాబు కొత్త ట్విస్ట్‌

548
SHARE

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగానే ఏపీకి ఆర్థిక సాయం చేశామంటూ అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఎంపీలు, మంత్రులతో తీవ్రస్థాయిలో చర్చలు జరిపారు. ఇప్పటికీ కేంద్రం నుంచి బయటకు రాకపోతే ప్రజల్లో చులకనవడం ఖాయమని ఎంపీలుచంద్రబాబుకు తేల్చిచెప్పారు. దీంతో రాత్రి 11 గంటల సమయంలో ప్రెస్‌మీట్ పెట్టిన చంద్రబాబు.. టీడీపీ కేంద్ర మంత్రులు ఇద్దరూ రాజీనామా చేస్తారని ప్రకటించారు.

గురువారం సుజనా, అశోక్‌ గజపతి రాజు రాజీనామా చేస్తారని చెప్పారు. ఆఖర్లో ప్రధాని మోడీతో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ మోడీ అందుబాటులోకి రాలేదు. ఈ విషయాన్ని ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు చెప్పారు. కేంద్రం సాయం చేసే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపించడం లేదని అందుకే కేంద్రమంత్రుల చేత రాజీనామా చేయిస్తున్నట్టు చెప్పారు.

మరి బీజేపీతో కటీఫ్ చేసుకుంటారా అన్న ప్రశ్నకు చంద్రబాబు తడబడ్డారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే బయటకు వస్తున్నామని… బీజేపీతో సంబంధాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పరోక్షంగా కేంద్రం నుంచి బయటకు వచ్చినా బీజేపీతో కలిసే ఉంటామని చంద్రబాబు చెప్పారు.

ఏపీ కేబినెట్‌లోని బీజేపీ మంత్రుల సంగతేంటని ప్రశ్నించగా… ఆ విషయంలో బీజేపీయే నిర్ణయం తీసుకోవాలన్నారు. మొత్తం మీద… ప్రభుత్వ పరంగానే కేంద్రంతో విబేధం తప్పించి.. బీజేపీకి- టీడీపీకి మధ్య ఎలాంటి వివాదం లేదన్న మేసేజ్ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించినట్టుగా ఉంది.