Home రాజకీయాలు బాబు మాటల పోరాటం దేనికి సంకేతం!

బాబు మాటల పోరాటం దేనికి సంకేతం!

SHARE

సుమారు 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన పద్దతులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోను మార్చుకోరని, ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలకంటే తమ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి తేల్చిచెప్పే ప్రయత్నం చేశారు. పైకి అనధికారికంగా బీజేపీపై కాస్త గట్టిగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నా లోలోపల మాత్రం ఇంకా బీజేపీపై రాజకీయ అవసరార్ధ ప్రేమ, భయం పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ ఆలోచనను బలపరుస్తున్నాయి బాబు తాజా మాటలు!

అసెంబ్లీలో టీడీపీ – బీజేపీ మధ్య జరిగిన రసవత్తర రాజకీయ స్నేహంలో కొన్ని విషయాలపై క్లారిటీ వచ్చింది. ఢిల్లీ వెళ్లి నాలుగు గోడల మధ్య సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అని టీడీపీ ఎంపీలపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో… ఏపీ అసేంబ్లీలో కూడా చంద్రబాబు తన సేఫ్ జోన్ తాను చూసుకుంటూ, బీజేపీపై తనదైన మార్కు బురద జల్లుతూ.. తమ మిత్రబంధం ఇంకా ఉంది (టెక్నికల్ గా కాదు), ఆ బందంపై తనకు బెమా ఉంది అనే స్థాయిలో మాట్లాడారు!

ఈ విషయాలపై సుదీర్ఘ పోరాటం అంటే అసెంబ్లీలో చేసే సుదీర్ఘ ప్రసంగంలా భావిస్తున్నారు అనే విమర్శలు పుష్కలంగా మూటకట్టుకున్న చంద్రబాబు… తాజాగా ఈ పరిస్థితుల్లో కూడా అదే పని చేశారు. అసెంబ్లీలో తాను ఎంత ఎక్కువ సమయం ప్రత్యేక హోదాపై మాట్లాడితే అంత ఎక్కువగా పోరాడుతున్నట్లు లెక్క అని అనుకున్నారో ఏమో కానీ… ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో బీజేపీ విషయంలో ఇంకా సన్నాయి నొక్కులే నొక్కుతున్నారు.

తెలుగు ప్రజలతో ఆడుకున్న కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని మొదలు పెట్టిన బాబు.. భవిష్యత్తులో మీకు ఇదే గతి పడుతుందని బీజేపీని కాస్త బెదిరించే పాత చింతకాయ హెచ్చరికలతో కూడిన పోరాటం ఒకటి చేశారు. అనంతరం బీజేపీ చేసిన మంచిపనుల గురించి కూడా తాము గతంలో గట్టిగానే చెప్పామని, ఇప్పుడు కూడా మిత్రపక్షం కనుకనే ఇంత సాఫ్ట్ గా శాంతియుత పోరాటం చేస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు!! ఈ పరిస్థితుల్లో కూడా బీజేపీ విషయంలో చంద్రబాబు చేష్టలు, వాటికి పోరాటం అని పెడుతున్న మాటలు తన రాజకీయ స్వార్ధాన్ని, బీజేపీపై తనకున్న భయాన్ని చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు!! ఈ విషయాలను గమనిస్తున్న సామాన్యులు మాత్రం చంద్రబాబుకు భారతీయ జనతా పార్టీ విషయంలో ఉన్నది ప్రేమా లేక భయమా అనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు!