Home రాజకీయాలు కర్ర ఇరగకుండా.. మోడీ కల్లు ఎర్రబడకుండా!

కర్ర ఇరగకుండా.. మోడీ కల్లు ఎర్రబడకుండా!

SHARE

ఇది కొత్తగా రాష్ట్ర విభజన జరిగిన సమయం కాదు.. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయం! ప్రజలు తమ అనుభవాన్ని, కేంద్రంతో ఉన్న సాన్నిహిత్యాన్ని నమ్మి అప్పగించిన బాధ్యత దాదాపు పూర్తవుతున్న సమయం!! అయినా కూడా ఇంకా పాతచింతకాయ పచ్చడి కబుర్లు, మీడియాలో ఫోటోలకు, కథనాలకు అవసరమైన విషయాలు మాత్రమే చెప్పే పనులు మానుకోలేదు టీడీపీ నేతలు! ఒకవైపు పోరాడాలి తప్ప మరో మార్గం లేదు, తీవ్రమైన ఒత్తిడి తేవాలి తప్ప మరో గత్యంతరం లేదు అని రాజకీయ విశ్లేషకులు, మేధావులూ, సీనియర్ రాజకీయ నాయకులు చెబుతుంటే… తాము మాత్రం “కర్ర ఇరగకుండా, మోడీ కల్లు ఎర్రబడకుండా” పోరాడతాం అంటున్నారు టీడీపీ నేతలు!

ప్రత్యేక హోదా స్థాయిని తగ్గించి, అది పెద్ద విషయం కాదని, సంజీవని అసలే కాదని మోసపూరిత మాటలు మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు… ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న సమయంలో తమ ఎంపీలను కూడా కేంద్రంపై పోరాడాలని వదిలారు! పోరాటం అంటే… రాజినామాలు చేయడం, దేశం మొత్తం చూసేలా పోరాటాలు చేయడం, మోడీ కదిలేలా స్పందించడం కాదు సుమా… కేంద్ర మంత్రులతో భేటీలు చేయడం!

ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశంపై ఒక పక్క వైకాపా నేతలు తీవ్రస్థాయిలో పోరాడుతుంటే.. బాధ్యత కలిగిన టీడీపీ నేతలు మాత్రం కేంద్ర మంత్రులతో మీటింగులు పెడుతున్నారు! ఇలానే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై భేటీ అయ్యారు టీడీపీ నేతలు! ఈ భేటీ అనంతరం బయటకొచ్చిన యనమల రామకృష్ణుడు… హోదా ఇవ్వాల్సిందే అని కోరాం, అన్ని విషయాలూ ఆయనకు తెలిపాం అని అన్నారు. విభజన సమస్యలపై చర్చ జరిగిందని, ఈమేరకు అన్ని విషయాలనూ జైట్లీకి వివరించామని యనమల తెలిపారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం.. నాలుగేళ్లుగా ఇలాంటి చర్చలు ఎన్నో ఎన్నెన్నో జరిగాయని ప్రజలు గుర్తించరని టీడీపీ ఎంపీలు భావించి మాట్లాడటం. చాలా మందికి అర్ధమయ్యే క్రికెట్ ఫార్ములానే ఉదాహరణగా తీసుకుంటే… మిడిల్ ఓవర్స్ లో కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ, చివరి ఓవర్లలో బంతులను బలంగా బాదాలి అనేది అందరికీ తెలిసిన విషయమే! కనీసం ఆ లాజిక్కు ప్రకారం అయినా ఆలోచించలేని టీడీపీ ఎంపీలు… సన్నాయి నొక్కులు నొక్కినంత కాలం, బీజేపీనీ నేతలను బ్రతిమాలాము అని చెప్పుకున్నంత కాలం చెప్పారు… అయితే అది గతం! జరిగిందేదో జరిగింది ఇప్పటికైనా పోరాడదాం.. ఓవర్స్ అయిపోతున్నాయి ఇకనైనా దూకుడుగా పోరాడదాం.. అనే ఆలోచన మరిచిన తమ్ముళ్లు మాత్రం ఇంకా ఏపీ వాసులను మోసం చేయడానికి తమవంతు పాత్రలు అద్భుతంగా పోషిస్తున్నారు.. ఫిక్సింగ్ ప్లేయర్స్ ఫెర్మార్మెన్స్ చూపిస్తున్నారు!

ఇంతకాలం ఇలా ఫలితాలు లేని చర్చలు జరగడం, చివరాకరున బయటకు వచ్చి.. చర్చలు సంతృప్తిగా ముగిసాయని ఒకసారి, ఈ చర్చలతో తాము సంతృప్తి చెందలేదని మరోసారి మార్చి మార్చి చెప్పిన ఏపీ అధికార పక్ష నేతలు ఇప్పటికైనా ఫలితం లేని చర్చల వల్ల, ప్రజలను మాయచేసే నాలుగు గోడల మధ్య జరిగే రహస్య మీటింగులవల్ల లాభం లేదని గుర్తించాలని, ఆ సమయం ముగిసి చాలా కాలమే అయ్యిందని గ్రహించాలని పలువురు సూచిస్తున్నారు!!