Home రాజకీయాలు విలీనం మాటపై తమ్ముళ్ల ఉత్సాహం!

విలీనం మాటపై తమ్ముళ్ల ఉత్సాహం!

303
SHARE

ఎలా గెలిచామన్నది కాదు ముఖ్యం.. గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అని ఒక సిద్దాంతాన్ని నమ్మి, దానికోసం రకరకాల పొత్తులు పెట్టుకోవడం, అనంతరం విడిపోవడం చంద్రబాబు రాజకీయ చరిత్రలో ప్రధాన ఘట్టాలు! ఈ క్రమంలో మరో గత్యంతరం లేకో ఎందుకో కానీ.. బీజేపీ – టీడీపీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ విషయంలో ఎవరి తప్పిదం ఎంత అనేది భవిష్యత్తులో మరో పార్టీతో పొత్తుపెట్టుకునే ముందు బాబు ప్రెస్ మీట్ లో చెప్పేవరకూ ఎదురుచూడాలి అనే విషయం పక్కనపెడితే… తాజాగా బాబు ఆలోచన అంతా పొత్తులపైనే ఉందని తెలుస్తుంది! ఏపీలో కచ్చితంగా బీజేపీతో స్నేహబందం ఉండకపోవచ్చని తాజా పరిస్థితులు దాదాపు స్పష్టం చేస్తున్న తరుణంలో.. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని ఇప్పటికే బీజేపీ నేతలు చెప్పుకొస్తూ స్పష్టం చేస్తున్నారు.

ఈ విషయాలపై స్పందిస్తున్న చంద్రబాబు మాత్రం.. ఎన్నికల నాటికి టి.టీడీపీ కచ్చితంగా పొత్తులతో పోరాటానికి దిగుతుందని, తద్వారా బలపడుతుందని తెలంగాణ టీడీపీనేతలను ఐసీయూపై ఉంచే ప్రయత్నం చేస్తున్నారు! ఎందుకంటే… ఏ రకంగా చూసుకున్నా రాబోయే సార్వత్రిక ఎన్నికలనాటికి తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏపార్టీ రెడీగా ఉండకపోవచ్చని స్పష్టం అవుతుంది. అయితే ఈ విషయాలపై మాత్రం బాబు చెప్పే మాటలు… వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు ఉంటాయని!

ఈ విషయాలపై జరుగుతున్న తాజా చర్చల్లో… రాబోయె సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తో పొత్తుకు అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ సానుకూలత వ్యక్తపరిచే అవకాశం లేదని తెలుస్తుంది. ఇక మిగిలింది అధికార తెరాస పార్టీ! అయితే ఈ విషయంలో తెలంగాణ టీడీపీకి ఒక సూచన చేస్తున్నారు సీనియర్ టీడీపీనేత మోత్కుపల్లి నర్సింహులు.. అదేమిటంటే టీటీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని! ఈ విషయంలో టి.టీడీపీలో నెలకొన్న గందరగోళం మామూలుది కాదు!!

మోత్కుపల్లి ఏ ఉద్దేశ్యంతో ఈ సూచన చేశారో తెలియదు కానీ… ఈ ఆలోచన బాగానే ఉందని చెబుతున్నారట పలువురు టీడీపీ నేతలు! అయితే ఈ ఆలోచన చినికి చినికి గాలివాన అవుతుందని అనుకున్నారో ఏమో కానీ… తెలంగాణ టీడీపీ రాబోయే ఎన్నికల్లో పొత్తుతోనే పోటీచేస్తుందని ప్రకటించేశారు చంద్రబాబు! అది ఎవరితో అయ్యే అవకాశాలు లేవు కాబట్టి… తెరాసలో విలీనం అయితే బాగుండు అని భావిస్తున్నారట టీడీపీ ఆశాజీవులు!! ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి.. భవిష్యత్తులో కలిసి పనిచేస్తాం అని తెలంగాణ టీడీపీ నేతలు తెరాస నాయకులతో బలవంతపు స్నేహం దిశగా పావులు కదుపుతున్నారట!! ఏది ఏమైనా… అటు విలీనమైనా, ఇటు పొత్తైనా అది అవతలి నేతల ఇష్టం కానీ, బాబు వైపు ఆ చాన్స్ లేదని, ఆప్షన్ ప్రస్తుతానికి బాబుకి లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!!