Home రాజకీయాలు కేసీఆర్ కు ట్రంప్, పుతిన్ ఫోన్!!

కేసీఆర్ కు ట్రంప్, పుతిన్ ఫోన్!!

SHARE

దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి అయినా మరో రాష్ట్ర ముఖ్యమంత్రో, ప్రధానో, అదీకాక కేంద్రమంత్రో ఫోన్ చేస్తే.. రాష్ట్రాభివృద్ధికోసమో, రాజకీయ లబ్ధి కోసమో మాట్లాడితే అది మనకు వార్త! కానీ… ఏకంగా ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తే.. ఫోన్ చేసి మాట్లాడి తాను చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటిస్తే.. అది మామూలు విషయం కాదు కదా!! అయితే.. ఈ విషయం నిజంగా జరిగింది కాదు లెండి. ఇది తెలంగాణ జేఏసీ మార్కు వెటకారాస్త్రం.

విషయానికొస్తే… గత రెండు రోజులుగా “కేసీఆర్.. చలో ఢిల్లీ” అంటూ తెలుగు మీడియా కథనాలమీద కథనాలు వడ్డించేస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఈ దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన క్రమంలో భావ సారూప్యత ఉన్న అన్ని పార్టీలనూ కూడగట్టేందుకు, అవసరమైతే జాతీయస్థాయిలో నాయకత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనకు దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి కూడా విశేష మద్దతు వెల్లువెత్తుతోందని తెరాస పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనల సంగతి తెలిసిందే. అయితే ఇదంతా పూర్తిగా అవాస్తవమని సాక్ష్యాలతో సహా నిరూపించే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ జేఏసీ!

“మోసపు ప్రచారాలకు ఇది పరాకాష్ట.. దేశమంతా మద్దతు.. థర్డ్ ఫ్రంట్ ప్రకంపనలు అంటూ వస్తున్న వార్తలు.. వాస్తవాలు…” అంటూ తన ఫేస్ బుక్ పేజీలో ఈ మేరకు జేఏసీ నిప్పులు చెరిగింది. థర్డ్ ఫ్రంట్ కు మద్దతుగా కేసీఆర్ కు దేశవ్యాప్తంగా ఫోన్లు మీద ఫోన్లు వచ్చేస్తున్నాయని, మరి ముఖ్యంగా మమతా బెనర్జీ నుండి కేసీఆర్ కు ఫోన్ అంటూ కోట్లు గుమ్మరించి చేస్తున్న ప్రచారాలు ఎంత అబద్ధామో జాతీయ పత్రిక “టెలిగ్రాఫ్”లో ప్రచురితమైన ఈ వార్త చూస్తే అంతా స్పష్టమవుతుంది.. అంటూ టెలీగ్రాఫ్ కథనాన్ని ఉదహరించింది తెలంగాణ జేఏసీ. అసలు మమతాబేనర్జీకి కేసీఆరే ఫోన్ చేశారు కానీ మమతాబేనర్జీనే కేసీఆర్ కు ఫోన్ చేసి స్వయంగా మద్దతు ప్రకటించారని మోసపు ప్రచారాలు – బిల్డప్పులూ.. ఇక కేసీఆర్ చెప్పిన ఏవిషయాన్నీ మమతా పూర్తిగా ఒప్పుకోలేదనే విషయం ఆ టెలీగ్రాఫ్ వార్త పూర్తిగా చదువుతే స్పష్టమవుతుంది.. డబ్బులు గుమ్మరించి ఇలాంటి వార్తలు ఇంకా రాయించుకుంటూనే ఉంటారు.. ముందుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంపు, రష్యా అధ్యక్షుడు పుతినూ కూడా కేసీఆర్ కు ఫోన్ చేశారని వార్తలొస్తే ఏమాత్రం ఆశ్చర్యపోకండి.. తెలంగాణలో ఇలాంటి మాయమాటలు నమ్మి మోసపోడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు… అంటూ ప్రకటించింది తెలంగాణ జేఏసీ.

ఏది ఏమైనా కేసీఆర్ విషయంలో అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్న కోదండరాం అండ్ కో ఏకంగా జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాలను సాక్ష్యాలుగా చూపిస్తూ ఎదురుదాడికి దిగడం కచ్చితంగా హాట్ టాపిక్కే! త్వరలో రాజకీయ అరంగేట్రం చేయనున్న జేఏసీ చైర్మన్ కోదండరాం తన ఎంట్రీకి ముందు నుంచే కేసీఆర్ అడుగులను, ఆలోచనా విధానాలను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంన్నారని, అందుకు ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే… ఈ రేంజ్ లో కథనం వండి వడ్డించేసిన లార్జెస్ట్ పత్రికపై ఆన్ లైన్ లో సెటైర్ల వర్షాలు పడటం! పెయిడ్ ఆర్టికల్స్ కి బాక్స్ కట్టాలి కదా అని, అక్షరాలు బ్లాక్ కలర్ లో కాకుండా పింక్ కలర్ లోనే ఇస్తే మరింత బాగుంటుందని మరి కొందరి సెటైరికల్ అభిప్రాయం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది!!