Home రాజకీయాలు గొట్టిపాటికి జగన్ బంపర్ ఆఫర్.. రాంబాబే అభ్యర్థి?

గొట్టిపాటికి జగన్ బంపర్ ఆఫర్.. రాంబాబే అభ్యర్థి?

8026
SHARE

పాదయాత్రలో వైఎస్ జగన్‌ మరోనేతకు పదవి ప్రకటించారు.  పర్చూరు నియోజవకర్గంపై క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ గొట్టిపాటి భరత్‌ గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.

ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇవ్వాలని భావించారు. కానీ పలుమార్లు వైఎస్‌ జగన్‌ను కలిసిన గొట్టిపాటి భరత్‌.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని స్పష్టం చేశారు. ఆర్థికంగా తనకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. తీరా ఎన్నికల సమయంలో చెబితే పార్టీకి ఇబ్బందిగా ఉంటుందనే ఈ విషయాన్ని ముందే చెబుతున్నానని జగన్‌కు వివరించారు. పార్టీకి మాత్రం తన సేవలు కొనసాగుతాయని వివరించారు. గొట్టిపాటి భరత్‌ వైసీపీపై అసంతృప్తితోనే పోటీకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరిగింది.

అయితే జగన్‌కు తనకు ప్రాణసమానమని వైసీపీని వీడి వెళ్లే ప్రసక్తే లేదని.. వ్యక్తిగత ఇబ్బందుల వల్లేపోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల గొట్టిపాటి భరత్‌ మీడియాకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ జగన్ .. మంగళవారం పర్చూరు నియోజవకర్గం ఇంకొల్లులో జరిగిన సభలో స్పష్టమైన ప్రకటన చేశారు. గొట్టిపాటి భరత్‌ తనకు తమ్ముడితో సమానమని వివరించారు. తాము అధికారంలోకి రాగానే తొలిదశలోనే గొట్టిపాటి భరత్‌ను ఎమ్మెల్సీగా చేస్తామని బహిరంగసభలో హామీ ఇచ్చారు.

భరత్‌ తన గుండెల్లో ఉంటారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో గొట్టిపాటి భరత్‌ జగన్ పక్కనే ఉన్నారు. జగన్‌ ప్రకటనతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. గొట్టిపాటి భరత్‌ను ఎమ్మెల్సీ చేస్తామని జగన్‌ ప్రకటించడంతో వచ్చే ఎన్నికల్లో పర్చూరు నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. అయితే పర్చూరి నుంచి పోటీ చేసేందుకు గొట్టిపాటి భరత్‌ తండ్రి గొట్టిపాటి నరసయ్య వద్ద ముఖ్య అనుచరుడిగా ఉన్న రాంబాబు సిద్ధమయ్యారు. రాంబాబు బళ్లారి ప్రాంతంలో వ్యాపారం చేస్తుంటారు.

ఆయన ఇటీవల వైసీపీ ముఖ్య నేతలను కూడా కలిసి గొట్టిపాటి భరత్‌ పోటీ చేయని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు గొట్టిపాటి భరత్‌ కూడా అభ్యంతరం చెప్పలేదని సమాచారం. దీని వల్లే వైఎస్‌ జగన్‌ గొట్టిపాటి భరత్‌కు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ కూడా నాలుగు గోడల మధ్య కాకుండా బహిరంగ సభలో ఇవ్వడం ద్వారా గొట్టిపాటి భరత్‌ వర్గీయుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.