Home రాజకీయాలు బాబు అర్ధరాత్రి సంబరం అంతపని చేసింది!

బాబు అర్ధరాత్రి సంబరం అంతపని చేసింది!

SHARE

సెప్టెంబర్ 7, 2016.. ఎంతో కాలంగా ఎన్నో ఆశలు పెంచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికపై కేంద్ర ప్రభుత్వం అరుణ్ జైట్లీ ద్వారా నీళ్లు చల్లించిన రోజు! అయితే ఆ రోజు ఉదయం నుండీ నాంచి నాంచి అర్ధరాత్రి మద్దెల దరువు వేశారు అరుణ్ జైట్లీ.. చావు కబురు చల్లగా చెప్పారు!! ఏపీ వాసులకు ఇది ఒకరకమైన బాద అనుకుంటే.. అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ ను ఖండించడానికి, ససేమిరా ఒప్పుకోము అనడానికి హుటా హుటున ప్రెస్ మీట్ పెట్టారేమో అని టీవీల ముందు అతుక్కుని కూర్చున్న ప్రజలకు చంద్రబాబు తనదైన మార్కు షాక్ ఇచ్చారు. అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పూర్తవగానే బాబు మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాటలు ఇప్పటికీ ఏపీ వాసుల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఢిల్లీలో ఏపీ టీడీపీ నేతలు మాత్రం నానా హడావిడి చేస్తు ప్రజలను మభ్యపెడుతున్నారు! నాడు అంత దారుణంగా అత్యంత బాదాకరంగా ప్రవర్తించిన చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందా… అనేది తాజాగా మెదులుతున్న ప్రశ్న!!

“టెక్నికల్ అంశాలను చూపిస్తూ హోదా ఇవ్వకపోయినా కూడా ఆస్థాయిలో ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెబుతుంది.. ఎంత ఇస్తే అంత తీసుకుందాం, అలాకాక మరేమి చేస్తాం” ఈ విషయంలో “కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలని మాట్లాడితే గనక వచ్చేవి కూడా రావు”… అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా రాదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాం అని ప్రకటించిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టిన చెప్పిన మాటలు అవి!! చేతకాక చేవలేక పోరాట పటిమ పక్కన పెట్టిన బాబు.. కేంద్రం చేసిన ప్రకటనకు సాగిలపడి చేసిన ప్రకటన నాడు అలా ఉంటే… నేడు మాత్రం ఏపీకీ ప్రత్యేక హోదా కావాలని ఢిల్లీలో రకరకాలుగా ఫోటోలకు ఫోజులిస్తున్నారు.. పోరాడుతున్నామని చెబుతున్నారు!

నిజంగా ఏపీకి ప్రత్యేక హోదా అనే విషయమై చంద్రబాబుకు, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే… నాడు అరుణ్ జైట్లీ ప్రకటన అనంతరమే పోరాటం దిశగా మాట్లాడుతూ, ప్రయత్నాలు ముమ్మరం చేసుంటే.. కేంద్రం ఈ రోజున ఇలా మాట్లాడటం, ఇలా ప్రవర్తించడం చేసి ఉండేది కాదనేది పలువురి అభిప్రాయంగా ఉంది. ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు విషయంలో బీజేపీది ఎంత నేరం ఉందో, టీడీపీది ఇంకా చాలా ఎక్కువే ఉందనేది తాజాగా వినిపిస్తున్న మాట! వెనకా ముందూ ఆలోచించకుండా చేశారా లేక మోడీ స్తుతి మైకంలో మాట్లాడారో తెలియదు కానీ.. జైట్లీ ప్రసంగం పూర్తవకుండానే బాబు చేసిన కృతజ్ఞత ప్రసంగ ప్రతిఫలం నేటి పరిస్థితి అని, చంద్రబాబు అర్ధరాత్రి సంబరాల ప్రతిఫలమే ఇంతపనికి కారణం అని అంటున్నారు విశ్లేషకులు!

ఆ సంగతుల నుంచి ఏపీ ప్రజలను ఏమార్చే ప్రయత్నంలో భాగమో ఏమో కానీ… ఢిల్లీలో ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు పోరాటాల పేరుచెప్పి హడావిడి చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే శక్తి ఉండి కూడా ఫోటోలకు ఫోజులివ్వడం, మైకుల ముందు సన్నాయి నొక్కులు నొక్కుతూ మాట్లాడటం వల్ల ఒనగోరే ప్రయోజనం శూన్యం అనే విషయం టీడీపీ నేతలకు తెలియదనుకుంటే అది ఆమాయకత్వమే అవుతుంది! మరి ఎందుకు ఈపని అంటారా… బాబు అర్ధరాత్రి చేసిన సంబరం ప్రజలకు గుర్తురాకుండా చేసే ప్రయత్నంలో భాగమే!! నాడు చాలు చాలు సరిపోతుంది, ఇచ్చినంత తీసుకుందా అని సాష్టాంగ పడిన బాబుకు, నేడు పోరాడదాం అని చెప్పడం, భేటీలు పెట్టించడం వెనక ఉన్నది రాజకీయ కారణం కాక మరేమిటి? ఇది కూడా నిజమైన పోరాటం అని నమ్మే పరిస్థితి ఉందా..? ఈ లెక్కన చూసుకుంటే… హోదా విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు రాబోయే ఎన్నికల్లో ప్రధాన శతృవుగా మారబోతుందనేది పలువురి అభిప్రాయంగా ఉంది!