Home రాజకీయాలు ఇదంతా తెలుగుతమ్ముళ్ల పనే- వివరణ ఇచ్చిన సాక్షి

ఇదంతా తెలుగుతమ్ముళ్ల పనే- వివరణ ఇచ్చిన సాక్షి

SHARE

ఈ మధ్య సోషల్‌ మీడియాలో కొందరు నెటిజన్లు అత్యుత్సాహం మీడియా సంస్థలకు కూడా సవాల్‌గా మారింది. మార్ఫింగ్, గ్రాఫిక్స్‌ అన్నది సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడంతో చాలా చిన్న విషయం అయిపోయింది. దీంతో కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నెటిజన్లు తమకు గిట్టని మీడియాసంస్థలపైనా బురదజల్లడం మొదలుపెట్టారు.

ఇదే పంథాలో కొందరు టీడీపీ నెటిజన్లు.. సాక్షి మీడియాను, వైసీపీని చులకన చేసేలా ఒక ఎత్తు వేశారు. సాక్షి వెబ్‌సైట్‌ లేఅవుట్‌ను నకిలీని సృష్టించి.. శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను సాక్షి మీడియా ఇంటర్వ్యూ చేసినట్టు కథనం సృష్టించారు. 2019 ఎన్నికల్లో జగన్‌ను సీఎంగా చూడాలని శ్రీదేవి తపించారని.. అవకాశం ఉంటే జగన్‌ దేశానికి ప్రధాని అయితే ఇంకా బాగుంటుందని శ్రీదేవిపదేపదే తమతో చెప్పేదని బోనీ కపూర్‌ సాక్షి మీడియాతో వెల్లడించినట్టు సదరు నకిలీ వార్తలో ఉంది. దీన్ని చూసి కొందరు నమ్మేశారు.

అదే సమయంలో శ్రీదేవి చనిపోయి అంతా బాధలో ఉంటే మధ్యలో ఈ రాజకీయం ఏమిటని విసుక్కున్నారు. టీడీపీ నెటిజన్లకు కావాల్సింది కూడా అదే. శ్రీదేవి మరణంపైనా శవ రాజకీయాలు చేస్తున్నారంటూ సాక్షి మీడియాతో పాటు జగన్‌పై జనానికి కోపం రావాలన్నదే టీడీపీ నెటిజన్ల ఎత్తుగడ. ఈ నేపథ్యంలో మీడియా వివరణ ఇచ్చింది.

కొందరు పనిగట్టుకుని గ్రాఫిక్స్ సాయంతో ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించి పాఠకులను తప్పుదోవ పట్టిస్తున్నారని.. అలాంటి వాటిని నమ్మవద్దని వివరించింది. తాము శ్రీదేవి కుటుంబసభ్యులను ఇంటర్వ్యూ చేయలేదని.. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫేక్‌ వార్తను నమ్మవద్దని కోరింది. సాక్షి మీడియా ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు తెలుగుతమ్ముళ్లే ఇలాంటి పనిచేస్తున్నారని సాక్షి మీడియా తన వివరణలో ఆరోపించింది.