Home రాజకీయాలు పెద్దల సభకు ముసుగు దారిలో జేపీ..

పెద్దల సభకు ముసుగు దారిలో జేపీ..

SHARE

పవన్‌ జేఎఫ్‌సీలో చేరి చంద్రబాబును సమర్ధిస్తూ మాట్లాడిన జేపీ అందరినీ ఆశ్చర్యపరిచారు. కేంద్రానికిరాష్ట్రం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదంటూ జేపీ వాదించి చంద్రబాబుకు అండగా నిలబడ్డారు. రాజ్యసభ సీటు కోసమే ఆయన ఇలా చేశారన్న వార్తలొచ్చాయి.

పవన్ కల్యాణ్ చిరంజీవి పేరును సూచించినప్పటికీ చంద్రబాబు మాత్రం పవన్‌ను కూడా ఒప్పించి జేపీ పేరును నిర్ణయించారని ప్రముఖంగా వార్తలొచ్చాయి. అయితే మేధావిగా, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడే జేపీ… 22 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలుషితమైన టీడీపీ సాయంతో రాజ్యసభకు ఎలా వెళ్తారన్న విమర్శ బలంగా వస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రజాశక్తి పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. జేపీని రాజ్యసభకు ఎవరు సిఫార్సు చేశారన్న దానిపై టీడీపీ-జనసేన మధ్య వాదన నడుస్తోందని వివరించింది. చంద్రబాబే పవన్‌ కల్యాణ్ ద్వారా జేపీకి రాజ్యసభ ప్రతిపాదన పంపించారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

టీడీపీ నేతలు మాత్రం పవనే జేపీ పేరును సిఫార్సు చేశారని వాదిస్తున్నారు. ఇది ఇలా ఉంటే టీడీపీ బీఫారంపై రాజ్యసభకు పోటీ చేస్తే చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచనలో జేపీ ఉన్నట్టు పత్రికకథనం. అందుకే పచ్చ ముద్ర పడకుండా స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగాలని జేపీ భావిస్తున్నారట.

స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేసి ఒక మేధావిగా తన అభ్యర్థిత్వాన్ని బలపరిచేలా చూస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన జేపీ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే జేపీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా… టీడీపీ బీఫారంపై పోటీ చేసినా.. ఓట్లు వేయించేది మాత్రం ఫిరాయింపుదారులతో కలిసి ఉన్న టీడీపీయే.

కాబట్టి జేపీ తెలివిగా స్వతంత్ర్య అభ్యర్థిగా పైకి కలరింగ్ ఇచ్చినా… దాన్ని అర్థం చేసుకోవడం ప్రజలకు పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదీ ఏమైనా ఇంతకాలంగా ఒక తటస్తుడిగా చెబుతూ వస్తున్న జేపీ.. ఇప్పుడు టీడీపీ సాయంతో రాజ్యసభకు వెళ్తే మాత్రం ఆయనపై ఇంతకాలం వచ్చిన కొద్దిపాటి విమర్శలను ఆమోదించినట్టే అవుతుందన్న అభిప్రాయం ఉంది. చూడాలి.. జేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో!. ఆయన మనసులో ఏముందో!.