Home రాజకీయాలు జగన్‌ ఆ విషయంలో ఏకపక్షంగా నిలబడ్డారు.. అందుకే..

జగన్‌ ఆ విషయంలో ఏకపక్షంగా నిలబడ్డారు.. అందుకే..

5457
SHARE

సమైక్యాంధ్ర విషయంలో జగన్ ఏకపక్షంగా నిలబడ్డారని అందుకే తాము వైసీపీ నుంచి బయటకు వచ్చామని ఒక ఇంటర్వ్యూలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ చెప్పారు. పూర్తి సమైక్యాంధ్ర పక్షం కాకుండా తెలంగాణ వైపు నుంచి కూడా ఆలోచించాలని కోరామని.. జగన్‌ మాత్రం సమైక్యాంధ్ర కావాలన్నారని చెప్పారు.

దాంతో తాము విబేధించి పార్టీ నుంచి బయటకు వచ్చామన్నారు. తమకు రాజకీయంగా జన్మనిచ్చింది వైఎస్‌ రాజశేఖర్ రెడ్డేనని.. రాజకీయ పునర్‌జన్మనిచ్చింది కేసీఆరేనని చెప్పారు. ఈ విషయాన్నిఎప్పుడైనా చెబుతామన్నారు.

తొమ్మిదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్పప్పుడు ఎర్రబెల్లి దయాకర్‌ రావు తమను తీవ్రంగా ఇబ్బందిపెట్టారని.. కొండా మురళీపై దాడులు కూడా చేయించారన్నారు. ఆ సమయంలో తమకు వైఎస్ ఒక్కరే అండగా నిలబడి ధైర్యం చెప్పారన్నారు.

ఆ ధైర్యంతోనే నాటి పరిస్థితులను ఎదుర్కోగలిగామన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయంగా నిలబెట్టింది వైఎస్సేనని చెప్పారు. ఆయన మరణం తర్వాత మంత్రి పదవి వదులుకోవడం తనకు వెంట్రుకలో సమానం అనిపించిందన్నారు.

ఆనాటి చర్యకు ఇప్పటికీ గర్వంగానే ఫీల్ అవుతానన్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఎర్రబెల్లిపై ఎలాంటిప్రతీకార చర్యలకు తాము దిగలేదన్నారు. సొంత తండ్రిని చంపిన వారినే క్షమించి వదిలిపెట్టిన వైఎస్ నాయకత్వంతో పనిచేస్తూ తాము ప్రతీకార చర్యలకు దిగకూడదనే మౌనంగా ఉండిపోయామన్నారు.

తనకు టీఆర్‌ఎస్‌లో సరైన గౌరవమే దక్కుతోందని ఆమె చెప్పారు. తనకు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ జిల్లాలోని 90 శాతం మంది నేతలు కేసీఆర్‌కు విన్నవించుకున్నారని ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెను కూడా బరిలో దింపుతామని కొండా సురేఖ చెప్పారు.