Home రాజకీయాలు ఐఏఎస్ రాజమౌళి ఎవరి బంధువో చెప్పిన వాసిరెడ్డి పద్మ

ఐఏఎస్ రాజమౌళి ఎవరి బంధువో చెప్పిన వాసిరెడ్డి పద్మ

1607
SHARE

చంద్రబాబు మొప్పుకోసం ఏకంగా రాజకీయ అంశాల్లోనూ జోక్యం చేసుకుంటూ… చివరకు ఎమ్మెల్యేల కొనుగోలులో కూడా కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వారిలో ఐఏఎస్ సతీష్ చంద్రబాబు, రాజమౌళి, సాయిప్రసాద్‌తో పాటు ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కీలక పాత్రదారులుగా ఉన్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

వారిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉంటానని.. అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఒక టీవీ చానల్ చర్చలో పాల్గొన్న వాసిరెడ్డి పద్మ.. ఐఏఎస్‌ల గురించి మరింత వివరంగా చెప్పారు. ఒక ఐఏఎస్ అధికారి ఏకంగా టీడీపీ మహానాడుకు హాజరయ్యారని చెప్పారు.

సెర్ప్‌ సీఈవోగా ఉన్న కృష్ణమోహన్‌… నంద్యాల ఉప ఎన్నికల సమయంలో డ్వాక్రామహిళల వద్దకు వెళ్లి టీడీపీకే ఓటేయాలని ఒత్తిడి తెచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి చెప్పిన ఐఏఎస్ అధికారి రాజమౌళి .. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు దగ్గరి బంధువని ఆమె వివరించారు.

యూపీ కేడర్‌లో ఉన్న రాజమౌళిని చంద్రబాబు సీఎం కాగానే డిప్యూటేషన్‌ మీద ఇక్కడకు తెచ్చారని చెప్పారు. ఇలా కావాల్సిన అధికారులను డిప్యూటేషన్ మీద తెచ్చుకుని టీడీపీ నాయకుల తరహాలో పనిచేయించుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.

కొందరు అధికారులు,పోలీస్ ఆఫీసర్లు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించినా.. వైసీపీ నేతలపై కేసులు పెట్టినా ఓర్చుకున్నామని.. కానీ ఇప్పుడు ఏకంగా పార్టీ ఎమ్మెల్యేలనే కొనే పనిలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కీలక పాత్ర పోషిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. త్వరలోనే మరింత మంది పేర్లు బయటకు వస్తాయన్నారు.