Home రాజకీయాలు ఆది ఫిప్టీ- ఫిఫ్టీ సెటిల్‌మెంట్‌.. ఆ ఇద్దరు ఐఏఎస్‌లు ఎవరు?

ఆది ఫిప్టీ- ఫిఫ్టీ సెటిల్‌మెంట్‌.. ఆ ఇద్దరు ఐఏఎస్‌లు ఎవరు?

SHARE

మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే కొందరు ఐఏఎస్‌లు రాజకీయ నేతల తరహాలో వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్న వేళ.. మంత్రి ఆదినారాయణరెడ్డి వివరించి ఆ ఇద్దరు ఐఏఎస్‌లు ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి చేపట్టిన ఆదినారాయణరెడ్డి.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో కుదిరిన డీల్ గురించి వివరించడం ఆ వీడియో ఉంది.

తనకు, రామసుబ్బారెడ్డికి ఫిప్టీ- ఫిప్టీ ఒప్పందం కుదిరిందని ఆదినారాయణరెడ్డి వివరించారు. చంద్రబాబే స్వయంగా పంచాయతీ చేసి తనను, రామసుబ్బారెడ్డిని నియోజకవర్గంలో డబ్బులను సగం-సగం పంచుకోవాల్సిందిగా పంచాయతీ చేశారని ఆది వివరించారు. చంద్రబాబు తనతో ఫిఫ్టీ- ఫిప్టీ పంచాయతీ చేసినప్పుడు ఇద్దరు ఐఏఎస్‌లు కూడా ఉన్నారని ఆదినారాయణరెడ్డి చెప్పారు. ఐఏఎస్‌లతో పాటు తమను కూర్చోబెట్టి చంద్రబాబు సెటిల్‌మెంట్ చేసినట్టు వెల్లడించారు. రామసుబ్బారెడ్డి వర్గం తనను ఎంతగా విమర్శించినా తాను పట్టించుకోబోనని… తన వర్గం వారు కూడా రామసుబ్బారెడ్డి వర్గంపై ప్రతివిమర్శలు చేయవద్దని ఆదినారాయణరెడ్డి సూచించారు. మీకు ఏవైనా పనులు కావాల్సి ఉంటే నన్ను అడగండి.. ఎస్‌ఎంఎస్‌ పెట్టండి నేనే చేసి పెడుతా అంటూ ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు.

”నేను మీ ఎమ్మెల్యేనే. పక్కకు పోయినప్పుడే మంత్రిని. రామసుబ్బారెడ్డికి కూడా ప్రతి రూపాయిలో అర్థరూపాయి భాగం ఉంది ఇక్కడ. అర్థరూపాయి భాగం ఇవ్వమని ముఖ్యమంత్రే స్వయంగా ఇద్దరు ఐఏఎస్‌ ఆఫీసర్లతో పాటు కూర్చోబెట్టి పంచాయతీ చేశారు. రామసుబ్బారెడ్డి అడిగిన దాంట్లో మనకు సగం వస్తుంది. మనం అడిగిన దాంట్లో ఆయనకు సగం వస్తుంది. వాళ్లు నన్ను ఏం విమర్శించినా నేనైతే పట్టించుకోను. మీరెవరూ దయచేసి విమర్శించకండి. మీకు కావాల్సిన పనులు నన్ను అడగండి. ఎస్‌ఎంఎస్ పెట్టండి. చేసి పెడుతా” అంటూ అనుచరులకు ఆదినారాయణరెడ్డి బోధ చేశారు.