Home రాజకీయాలు జేపీకి బాబు ఆ భారీ ఆఫర్

జేపీకి బాబు ఆ భారీ ఆఫర్

640
SHARE

లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ. మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన జేపీ ఒక మేధావిగా పేరు. కానీ అదే సమయంలో ఆయన రాజకీయ నిర్ణయాలను విమర్శించే వారు లేకపోలేదు. కూకట్‌పల్లిలో జేపీ పోటీ దగ్గర నుంచి పవన్ జేఏఫ్‌సీలో చేరి చంద్రబాబుకు వంత పాడడం వరకు పలుమార్లు ఆయనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

జేఎఫ్‌సీలో చేరి కేంద్ర ఇచ్చిన డబ్బులకు చంద్రబాబు ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని జేపీ తెగేసి చెప్పిన విధానం చూసి సాటి టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. చంద్రబాబును మరీ ఓపెన్‌గా జేపీ వెనుకేసుకురావడం చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఆయన అలా చేసింది రాజ్యసభ సీటు కోసమేనని తెలుస్తోంది. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. జేపీ టీడీపీతో కలిసిపోతున్నారు.

టీడీపీ కోటాలో జేపీని రాజ్యసభకు పంపేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. చిరంజీవికి అవకాశం ఇవ్వాలని పార్ట్నర్‌ పవన్‌ కల్యాణ్ కోరినప్పటికీ చంద్రబాబు మాత్రం జేపీ వైపే మొగ్గుచూపారని ప్రజాశక్తి పత్రిక కథనం చెబుతోంది. చిరంజీవిపై సర్వే చేయించామని.. ఆయనకు ప్రజల్లో పలుకుబడి లేదని, రాజకీయంగా క్రియాశీలకంగా లేరని, కాబట్టి రాజ్యసభకు పంపినా ఉపయోగం ఉండదని చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ను ఒప్పించారని పత్రిక కథనం చెబుతోంది. దీంతో పవన్‌ కల్యాణ్ కూడా జేపీని రాజ్యసభకు పంపేందుకు అంగీకరించారట.

వచ్చే నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లోఏపీ నుంచి మూడు స్థానాలకు ఎన్నికలుజరుగుతాయి. అందులో రెండు టీడీపీకి, ఒకటి వైసీపీకీ దక్కనున్నాయి. టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే వారి జాబితాలో రిలయన్స్ సంస్థ ఉపాధ్యక్షుడు మాధవ్ పేరు కూడా ఉందని చెబుతున్నారు. మొత్తం మీద ఇంతకాలంగా మేధావుగా, స్వచ్చమైన రాజకీయాల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న జేపీ.. ఒకవేళ టీడీపీ కోటాలో రాజ్యసభకు వెళ్తే మాత్రం ఆ పేరును చెరిపేసుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ 23 వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. వారు కూడా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటేయనున్నారు. అంటే కల్తీ సరుకుతో రాజ్యసభకు వెళ్లిన పేరు ఆయనకు మిగిలిపోవచ్చు.