Home రాజకీయాలు నన్నూ కొనేందుకు వచ్చారు..

నన్నూ కొనేందుకు వచ్చారు..

2529
SHARE

రాము సూర్యారావు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ. ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న అతికొద్ది మంది నిజాయితీపరుల్లో ఆయన ఒకరు. రాము సూర్యారావు వ్యక్తిత్వాన్ని, నిజాయితీని ప్రశ్నించే సాహసం కూడా ఎవరూ చేయలేరు.

గతంలో ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైర్ అయిన సూర్యారావు.. అనంతరం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో స్వయంగా చెత్తను ఎత్తుతుంటారు.

అనేక మంది విద్యార్థులకు ఫీజులు కడుతుంటారు. ఆ ప్రయత్నంలో తన పొలాలను కూడా అమ్మేశారాయన. ఎలాంటి బలం లేకపోయినా నిజాయితీతోనే ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు. అయితే ఇంతటి నిజాయితీపరుడిని కూడా కొనేందుకు అధికార పార్టీ ప్రయత్నించడం విస్మయం కలిగిస్తోంది.

మంగళవారం ఒక చర్చాకార్యక్రమంలో పాల్గొన్న రాము సూర్యారావు.. రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలపై స్పందించారు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. తాను ఎమ్మెల్సీగా పోటీ చేసిన సమయంలో ఐదు కోట్ల రూపాయలకు తనను కొనేందుకు వచ్చారని చెప్పారు.

ఎన్నికల్లో పోటీ చేసినా సరే ప్రచారానికి రాకుండా ఇంట్లో పడుకుంటే చాలాని..అంతా తాము చూసుకుంటామంటూ ఐదు కోట్ల రూపాయలు ఇస్తామంటూ వచ్చారన్నారు. తాను అలాంటి వాడిని కాదని… ఒక నమస్కారం పెట్టానని రాము సూర్యారావు చెప్పారు. అయినప్పటికీ వారు పీడించడం ఆపలేదని… దాంతో వారి వ్యవహారాన్ని యూడీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

నిజాయితీపరుడుగా బతుకుతున్న సూర్యారావును కూడా కొనాలనుకోవడం సరికాదని ఆయనచెప్పడంతో కాస్త వెనక్కు తగ్గారని చెప్పారు. పోటీ చేసినా కేవలం ప్రచారానికి రాకుండా ఇంట్లో పడుకుంటేనే ఐదు కోట్లు ఇస్తామన్నారంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇక ఎలా టీడీపీలో చేరారో అర్థం చేసుకోవచ్చని సూర్యారావు వ్యాఖ్యానించారు.