Home రాజకీయాలు చీఫ్‌ విప్‌ ఐతే గొప్పోడనుకుంటున్నావా- జేసీ ఫైర్.. కేసు నమోదు

చీఫ్‌ విప్‌ ఐతే గొప్పోడనుకుంటున్నావా- జేసీ ఫైర్.. కేసు నమోదు

1152
SHARE

ప్రభుత్వ చీఫ్‌ విప్‌, పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చిన వ్యవహారం కలకలం రేపుతోంది. టీడీపీలో వర్గ విబేధాలను మరోసారి బయటపెట్టింది. వ్యవహారం ఏకంగా జేసీ దివాకర్ రెడ్డి పీఏపై కేసు నమోదు వరకు వెళ్లింది.

ఇటీవల పుట్టపర్తి నియోకవర్గంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. పల్లె వర్గం, జేసీ వర్గంగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు కొందరు స్థానిక నేతలు జేసీని కలిసి పల్లె రఘునాథరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఒక రోడ్డు కాంట్రాక్ట్ ను జేసీ తన అనుచరుడికి ఇచ్చుకున్నారు. అయితే ఆ పని చేయకుండా పల్లె అడ్డుపడుతున్నారని… బిల్లులు రాకుండా అడ్డుపుల్ల వేస్తున్నారనంటూ జేసీకి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఫోన్ తీసుకున్న జేసీ దివాకర్ రెడ్డి… పల్లె రఘునాథ్‌ రెడ్డికి ఫోన్‌ చేసి వార్నింగ్ ఇచ్చారు.

వైఖరి మార్చుకోవాల్సిందిగా పల్లెకు హెచ్చరించారు. కార్యకర్తలను సమన్వయం చేసుకోలేనప్పుడు చీఫ్ విప్ పదవి ఎందుకని ప్రశ్నించారు. చీఫ్ విప్‌ అయినంత మాత్రాన గొప్పోడివి అనుకుంటున్నావా అంటూ వాయించారు. జేసీ ఇలా ఫోన్‌లో వార్నింగ్ ఇస్తున్న దృశ్యాలను జేసీ పీఏ కొండసాని సురేశ్‌ రెడ్డి రహస్యంగా రికార్డు చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. దీనిపై పల్లె రఘునాథరెడ్డి ఆగ్రహించారు.

తన పరువకు భంగం కలిగించేలా వీడియోను విడుదల చేశారంటూ అనుచరుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.   దివాకర్ రెడ్డి పీఏ కొండసాని సురేశ్‌ రెడ్డితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. జేసీ పీఏపైనే పల్లె వర్గం కేసులు పెట్టడంతో టీడీపీలో కాకరేపుతోంది. జేసీతో తనకు ఎలాంటి విబేధాలు లేవని… కాకపోతే రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును వైసీపీకి చెందిన రామ్మోహన్‌కు జేసీ దివాకర్ రెడ్డి ఇవ్వడంతోనే ఇబ్బందులు వచ్చాయని వివరించారు. తనకు జేసీ ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదని చెప్పారు.