Home రాజకీయాలు ఎవరైనా హెచ్చరిస్తే మాట మార్చేస్తారా పవన్ గారు.. ?

ఎవరైనా హెచ్చరిస్తే మాట మార్చేస్తారా పవన్ గారు.. ?

789
SHARE

సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లలో డైలాగ్స్ ఎలా అయితే చెబుతారో అలానే ప్రిపేర్ అయి తన రాజకీయ ప్రసంగాలలో కూడా వల్లించారే తప్ప ఆయనకు ఆయన చెప్పిన మాటల మీద కట్టుబడి ఉండే అలవాటు లేదని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ” నేను ఎవరికీ భయపడను.. నేను మడమ తిప్పను.. నేను ఎప్పుడూ వెనుకంజ అనేది వేయను… ఏదైనా చేయాలనీ అనుకుంటే అది చేసేవరకు పోరాడి తీరుతాను” అంటూ ఎన్నో డైలాగ్స్ ను తన ప్రసంగాలలో వినిపిస్తూనే ఉంటాడు.

అందుకే పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రసంగంలో ఎన్ని వేల ఈలలు, చప్పట్లు వినిపిస్తాయో.. వాటికసలు లెక్క అనేది కూడా ఉండదు. ప్రస్తుతమున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ ” దమ్ము, ధైర్యం, తెగింపు పుష్కలంగా ఉన్న నాయకుడు వైసీపీ అధినేత జగన్” అని అన్నారు. పవన్ ఈ మాటలను ఆయన మనస్ఫూర్తిగా అన్నారో లేక వెటకారంగా అన్నారో అనే విషయమైతే తెలియదు కానీ తనకు మాత్రం జగన్ కున్న లక్షణాలు లేవని స్పష్టంగా చాటుకున్నాడు.

పవన్ ఏదైనా చేస్తాను అని హామీ ఇచ్చినప్పుడు ఆ హామీ విషయంలో ఏవైనా గొడవలు వస్తే వెంటనే వెనక్కి తగ్గుతారు. ఇందులో భాగంగానే ఇటీవల పవన్ మత్స్యకారులను సంప్రదించి.. వారిని ఎస్టీల్లో చేర్చడంపై హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పుడు ఆ హామీపై నిలబడాలి. ఇచ్చిన మాటను నిలపెట్టుకునే సమయం వచ్చేసరికి మాత్రం ” నాకు బెదిరింపులు వస్తున్నాయి.. నన్ను నేను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం… నా అవసరం జాతికి చాలా ఉంది ” అంటూ ముసుగేసుకుని ఇంటికి మాత్రమే పరిమితం అవుతాడు.
పవన్ కున్న నాయకత్వ లక్షణం ఇదేనా ? హెచ్చరిస్తున్నారు… బెదిరింపులొస్తున్నాయి అంటూ ఇప్పుడు వెనక్కి అడుగేస్తున్నారే… రాజకీయాల్లో అడుగుపెట్టేటప్పుడు ఈ విషయం తెలియదా ? రాజకీయాలు అంటే ఈ మాత్రం ఉంటాయని కూడా పవన్ కు తెలియదా ? పాపం.. పవన్ రాజకీయాలంటే కేవలం విజిల్సూ చప్పట్లూ మాత్రమే అని అనుకున్నట్లు ఉన్నారు.

అందుకే ప్రసంగం సమయంలో విజిల్సూ చప్పట్లూ కోసం ” మీకు నేను అండగా ఉంటాను.. మీకోసమే నేను ఉన్నాను.. మీకోసం వస్తున్నాను… మీకున్న సమస్యలేంటో చెప్పండి.. అంటూ వారికీ భరోసా ఇవ్వడం తరువాత ఏవైనా హెచ్చరికలోస్తే వాటిని వదిలేయడం పవన్ కు బాగా అలవాటు అయిపోయినట్లుంది. అందుకే ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టానని చెప్పినందుకు ప్రజలు ఇప్పుడు పవన్ ను ప్రశ్నిస్తున్నారు. హెచ్చరికలు రాగానే పర్యటనను క్యాన్సిల్ చేసుకున్న రాజకీయ నాయకుడు పవన్ ఒక్కడే అని పలువురు రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై పవన్ కనీసం ఆత్మ విమర్శ అయిన చేసుకుంటారో లేదో అనేది మాత్రం చూడాలి.