Home రాజకీయాలు బీజేపీ- జగన్ ఒప్పందంపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

బీజేపీ- జగన్ ఒప్పందంపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

1781
SHARE

బీజేపీ- జగన్ మధ్య ఒప్పందం కుదిరిందని టీడీపీ చేస్తున్న ప్రచారంపై మాజీ ఎంపీ ఉండవల్లి తన అభిప్రాయాన్ని వివరించారు. తానైతే బీజేపీ, జగన్ మధ్య ఒప్పందం కుదిరిందని భావించడం లేదన్నారు.

బీజేపీ కలిసి ఉంటున్న చంద్రబాబు కూడా ఈ ఆరోపణ చేయడం అంటే బీజేపీని అవమానించడమేనన్నారు. ఒకవేళ నిజంగా జగన్‌ బీజేపీతో చేతులు కలిపి ఉంటే ప్రతి శుక్రవారం పాదయాత్రను మధ్య వదిలేసి కోర్టుకు రావాల్సిన అవసరం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కోర్టుకు హాజరు మినహాయింపు చాలా చిన్న విషయం అన్నారు.

సీబీఐ అభ్యంతరం చెప్పకపోతే చాలు హాజరు నుంచి మినహాయింపు వస్తుందన్నారు. బీజేపీతో జగన్‌కు ఒప్పందం ఉంటే కోర్టుకు ప్రతి శుక్రవారం రావాల్సిన శ్రమ తప్పేదన్నారు. వైసీపీ అవిశ్వాసం పెట్టడం మంచి పరిణామనని.. దీని వల్ల ప్రభుత్వం కూలిపోకపోయినా సమస్య దేశం మొత్తం తెలుస్తుందన్నారు. అవిశ్వాసం టీడీపీనే పెట్టి ఉంటే మరింత ప్రభావం ఉండేదన్నారు.

పోలవరానికి సంబంధించిన కొన్ని వివరాలను జనవరి, ఫిబ్రవరిలో ప్రభుత్వమే వెబ్‌సైట్‌లో పెట్టిందని.. తెలిసిపెట్టారో తెలియక పెట్టారో కానీ పోలవరం పవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి భయంకరమైన నిజం ఒకటి బయటకు వచ్చిందన్నారు. డాక్యుమెంట్లు సేకరించిన తర్వాత మీడియా ముందే ఆ భయంకర నిజాన్ని బయటపెడుతానని ఉండవల్లి చెప్పారు.

సరిగ్గా నాలుగేళ్ల క్రితమే ఇదే రోజు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలంటూ వెంకయ్యనాయుడు ప్రసంగం చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ ఏపీకి వచ్చిన ఉపయోగం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. పవన్‌ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసిపోటీ చేస్తారో లేదో తనకు తెలియదన్నారు. పవన్‌తో తాను మాట్లాడింది చాలా తక్కువ సమయం మాత్రమేనని ఉండవల్లి చెప్పారు. రాజమండ్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి ఈవ్యాఖ్యలు చేశారు.