Home రాజకీయాలు ముందు ఉట్టికెగురు పవన్ కల్యాణ్‌

ముందు ఉట్టికెగురు పవన్ కల్యాణ్‌

835
SHARE

వైసీపీ ఎంపీలు కేంద్రంపై మార్చి 5నే అవిశ్వాసం పెట్టాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. అసలు రూల్స్ తెలిసే పవన్‌ కల్యాణ్ మాట్లాడుతున్నారా అన్న అనుమానం వ్యక్తం చేశారు.

అవిశ్వాసంపై నోటీసు ఇచ్చిన రోజే అది సభ ముందుకు వస్తుందని.. ఆ సమయంలో 50 మంది సభ్యులు మద్దతు తెలపకపోతే చెత్తబుట్టలోకి అది వెళ్తుందన్నారు. కాబట్టే తీర్మానానికి మద్దతు కూడగట్టి మార్చి 21న అవిశ్వాసం ప్రవేశపెడుతామని అంబటి చెప్పారు.

పవన్‌ కల్యాణ్, చంద్రబాబులు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా అవిశ్వాసం పెట్టి తీరుతామన్నారు. పార్టనర్‌చంద్రబాబును అవిశ్వాసానికి ఒప్పించడం చేతగాని పవన్ కల్యాణ్… ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు వెళ్లి అక్కడి పార్టీలను ఒప్పిస్తానని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.

ఉట్టికి ఎగరలేమ్మ.. స్వర్గానికి ఎగురుతా అన్నట్టుగా పవన్‌ కల్యాణ్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ది ఉంటే అవిశ్వాసానికి చంద్రబాబును ఒప్పించాలని అంబటి సవాల్ చేశారు. జేఎఫ్‌సీ లో ఉంటూ కేంద్ర నిధులకు రాష్ట్రం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని జయప్రకాశ్‌ నారాయణ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

చంద్రబాబును రక్షించేందుకు జేపీ వ్యాఖ్యలు చేసినట్టు అందరికీ అర్థమవుతోందన్నారు. చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్ మద్దతు ఇస్తే తమకు అభ్యంతరం లేదని.. కానీ ముసుగు రాజకీయాలు చేసి సమాజాన్ని తప్పుదోవ పట్టించవద్దని అంబటి కోరారు. పాచిపోయిన లడ్డుల్లాంటి ప్యాకేజ్‌కు చంద్రబాబు అంగీకరించినప్పుడు పవన్‌ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు.

నీతివంతమైన రాజకీయాలు చేస్తానన్న పవన్‌ కల్యాణ్‌… ఓటుకు నోటు కేసులో నల్లధనం ఇస్తూ చంద్రబాబు దొరికిపోతే కనీసం అది తప్పు అని ఎందుకు చెప్పలేదని అంబటి ప్రశ్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కనీసం అదైనా తప్పు అని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.

ఇన్ని చెబుతున్న పవన్ కల్యాణ్… చంద్రబాబును అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావాల్సిందిగా ఎందుకు డిమాండ్ చేయడం లేదని పవన్‌ను అంబటి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. వినూత్న మార్గాల్లో చంద్రబాబుకు మంచిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉందన్నారు.