Home రాజకీయాలు తెగింపు రాజకీయం.. తగాదా ఫలితం

తెగింపు రాజకీయం.. తగాదా ఫలితం

SHARE

మన సేప్టి ఫస్ట్‌… జనం సేప్టీ నెక్స్ట్ అనుకునే వారితో రాజకీయంగా పోరాటం చేయడం ఈజీ. అలాకాకుండా తనకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే టార్గెట్‌ మాత్రం మిస్ అవకూడదు అనుకునే వారితోనే కష్టం. అలాంటి వారికి ఎదురెళ్తే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది.

నాలుగేళ్లుగా చంద్రబాబు ఆయన పార్టనర్‌ అని భావిస్తున్న పవన్ కల్యాణ్‌ ఒక పద్దతి ప్రకారం నడిపిన రాజకీయం ఇప్పుడు అనుకున్న ఫలితాన్ని ఇస్తున్నట్టు కనిపించడం లేదు.

జగన్‌ ఎప్పుడు ప్రత్యేక హోదా గురించి కార్యక్రమాలను నిర్వహించిన వెంటనే పవన్‌ కల్యాణ్ కూడా ఏదో ఒక కార్యక్రమం అంటూ బయలుదేరడం చాలా సార్లు జరిగింది.

దాని వల్లే ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతున్న పవనీయం అన్న అనుమానం బలపడుతూ వచ్చింది. దాని వల్ల వైసీపీకి ఇరిటేషన్ వచ్చిన మాట నిజమే. కాకపోతే పవన్‌ ఎటు ఉంటారో తెలియక వైసీపీ సంయమనం పాటించినంత కాలం చంద్రబాబు డైరెక్షన్‌లో పవనీయం బాగానే రక్తికట్టింది.

కానీ పరిటాల సునీత ఇంటికి పవన్‌ వెళ్లిన తర్వాత ఆయన ఆ గూటి పక్షే అని నిర్ధారణ అయిపోయింది. అప్పటి నుంచి వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కూడా పవన్‌పై నేరుగానే విమర్శలు చేస్తున్నారు. అయితే కేంద్ర బడ్జెట్‌ తర్వాత చంద్రబాబు ఇరుకునపడడంతో పవన్‌ కల్యాణ్‌ జేఏసీ అని.. అ తర్వాత జేఎఫ్‌సీ అంటూ కథ రక్తికట్టించారు.

గతంలో ఎంపీలంతా రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేసిన పవన్‌ కల్యాణే… ఇటీవల వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమనడంతో టోన్ మార్చారు. రాజీనామాలు కాదు.. చిత్తశుద్ది ఉంటే కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని చాలెంజ్‌ చేశారు.

ఇది వైసీపీ ఎంపీల రాజీనామా ఎత్తు నుంచి చంద్రబాబును గట్టునపడేసేందుకే అన్నది అర్థమైన అంశమే. జగన్‌పై కేసులున్నాయి.. మోడీ అంటే భయం, అందుకే అవిశ్వాసం సాహసం చేయరని పవన్‌ కల్యాణ్ భ్రమించి ఉండవచ్చు.

పైగా మొన్నటి వరకు హోదా కోసం గళమెత్తిన పవన్‌… తెలివిగా అంకెలు తవ్వుతా అంటూ అసలు విషయాన్ని పక్క దారి పట్టించేందుకు ప్రయత్నించారు. అయితే ఈసారి వైసీపీ అధ్యక్షుడి నుంచి ఊహించని స్పందనే వచ్చింది.

ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టినట్టుగా జగన్‌ సవాల్ ఉందనే చెప్పాలి. జగన్‌పై కేసులున్నాయి.. కాబట్టి మోడీ అంటే భయం, అందుకే అవిశ్వాసం పెట్టకుండా రాజీనామా డ్రామాలు ఆడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి తాను అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధం అని ప్రకటించడం ద్వారా చెక్‌ పెట్టారు.

అదే సమయంలోపార్టనర్‌ అయిన చంద్రబాబును కూడా పవన్‌ ఒప్పించాలని సవాల్ చేయడం ద్వారా… పవన్‌ రాజకీయ చిత్తశుద్దికి జగన్ పరీక్ష పెట్టారు. ఇక పవన్‌ ఆవేశంలో చేసిన అవిశ్వాసం డిమాండ్ ఆఖరుకు చంద్రబాబుకే పెద్ద ఇబ్బందిగా మారింది. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తామంటే పవన్ జేఎఫ్‌సీలోని కొందరు పెద్దమనుషులు .. అబ్బే రాజీనామాలు చేస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు.

వైసీపీ ఎత్తులో పసలేదని చాటేందుకు ప్రయత్నించారు. కానీ పవన్‌ కల్యాణ్ డిమాండ్ చేసినట్టుగానే అవిశ్వాసానికి తాము సిద్దమని చెప్పడం ద్వారా ఎంపీల రాజీనామాల విషయంలో తమపై విమర్శలు చేస్తున్న వారి నోర్లకు జగన్‌ తాళం వేసినట్టుగా అయింది. ప్రత్యేక హోదా కోసం తాను ఎంతవరకైనా సిద్ధమని జగన్‌ ప్రకటించేశారు.

ఇప్పుడు చిత్తశుద్ది నిరూపించుకోవాల్సిన బాధ్యత పార్టనర్స్‌పై పడింది. జగన్‌ చెప్పినట్టు అవిశ్వాసానికి చంద్రబాబును పవన్ ఒప్పిస్తారా?. పవన్ చెబితే చంద్రబాబు మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ధైర్యం చేస్తారా?. వైసీపీ ఎంపీల రాజీనామాలు డ్రామా అని వ్యాఖ్యానించిన మేధావులు ఇప్పుడు అవిశ్వాసంపై చంద్రబాబును ఒప్పించాలని పవన్‌కు… మోడీపై ఎదురుతిరగాలని చంద్రబాబుకు హితభోద చేయగలుగుతారా?.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో పవన్‌ లెక్క ఒకే ఒక్క పాయింట్‌ మీద తప్పినట్టుగా అర్థమవుతోంది. జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి భయపడుతూ బతుకుతున్నారు కాబోలు కాబట్టి అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధపడే సాహసం చేసే సీన్‌ లేదని పవన్‌ భావించడంతోనే లెక్క తప్పింది. కానీ తెగింపు రాజకీయంతో జగన్‌ తిరిగి విసిరిన సవాల్‌కు పసిగుడ్డు జనసేనతో పాటు ప్రపంచానికి పాఠాలు చెప్పిన చంద్రబాబుకు చిక్కొచ్చి పడింది.